సిద్దార్ధతో ప్రకాష్ రాజ్ సినిమా
యూత్ లవర్ బాయ్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్న హీరోల్లో సిద్దార్ధ ఒకరు. కొత్త హీరోల నుంచి సిద్దార్ధకు ఇప్పుడు గట్టి పోటీ ఉన్నప్పటికీ నటనలో తనకున్న అనుభవంతో సిద్దార్ధ తన పట్టు కొనసాగిస్తున్నారు. ఈమధ్యనే విడుదలైన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రం సైతం 50 రోజులు పూర్తి చేసుకుని సిద్దార్ధకు కొత్త ఊపిరిపోసింది. ప్రస్తుతం 'ఓయ్' అనే యూత్ ఫుల్ కథాచిత్రంలో ఆయన నటిస్తున్నారు. సిద్దార్ధతో స్క్రీన్ కాంబినేషన్ అనగానే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గుర్తుకువస్తారు. ఈ ఇద్దరూ కలిసి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' వరకూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రకాష్ రాజ్ నటుడిగా కొనసాగుతూనే అభిరుచిగల నిర్మాతగా కూడా తన సత్తా చాటుకుంటున్నారు. తల్లీకూతుళ్లు అనుబంధాన్ని ఆవిష్కరించే 'ఆకాశమంత' చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూరగొంటోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ కు ప్రకాష్ రాజ్ నిర్మాత. ఇది ప్రకాష్ రాజ్ కుటుంబ కథేననట కూడా. సినిమా తీస్తున్నప్పుడు తన 13 ఏళ్ల కూతురు అడుగడుగునా గుర్తుకువచ్చిందని ప్రకాష్ రాజ్ ఇటీవల చెప్పుకొచ్చారు. తాజాగా ప్రకాష్ రాజ్ మరో ముచ్చటైన కథతో సిద్దార్ధ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇటీవల తనకు బాగా నచ్చిన ఈ కథను సిద్దార్ధకు వినిపించారనీ, సొంతంగా ఈ సినిమా నిర్మించాలని అనుకుంటున్నట్టు తెలియజేశారనీ చెబుతున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు సిద్దార్ధకు అప్పగించారని కూడా తెలుస్తోంది. సిద్దార్ధ నటుడు కాకమునుపు దర్శకత్వ శాఖలో మంచి అనుభవం కూడా సాధించారు. శంకర్, మణిరత్నం వంటి దిగ్దర్శకుల వద్ద పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆ తపనతోనే తాను హీరోగా నటించే సినిమాల విషయంలోనూ ఆయా చిత్రాల దర్శకుడికి తగిన సూచనలు సలహాలు ఇస్తుంటారు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి వస్తే సిద్దార్ధ నటుడిగానే గాకుండా దర్శకుడిగా కూడా ప్రమోట్ అయినట్టే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.
Be first to comment on this News / Article!
|