24న వీడనున్న 'డైరీ' మిస్టరీ
డైరీ రాసే అలవాటు చాలామందికి సహజం. అయితే డైరీ రాయడమంటే ఒకరోజుతో అయ్యే పని కాదు. ఒక వ్యక్తి రాసుకున్న డైరీ చుట్టూ కొన్ని మిస్టీరియస్ సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆ మిస్టరీ ఏమిటో తెలియాలంటే మా 'డైరీ' సినిమా చూడాల్సిందేనని ఆ చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నారు. 'మంత్ర' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ కు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని జెన్ నెక్స్ట్ మూవీస్ సంస్థ గ్రేట్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నిర్మించింది. సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణ సారథ్యంలో కల్యాణ్ రామ్ చుక్కా, మేఘశ్యామ్ బోకం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మచ్చకంటి రామకృష్ణ దర్శకుడు. శివాజీ, శ్రద్ధాదాస్, సజిత హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఈనెల 24న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
ఒక డైరీ వల్ల ఈ చిత్రంలోని పాత్రలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయనేది ఆసక్తికరంగా ఉంటుందనీ, 'మంత్ర' చిత్రానికి ఇది సీక్వెల్ అయినప్పటికీ మరో కొత్త కోణంలో వినోదాన్ని మేళవించి ఉంటుందనీ వారు తెలిపారు. శివాజీ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నారు. అలెప్పీ, వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ జరిపామనీ, ఇందులో కేవలం రెండే పాటలు ఉంటాయనీ చెప్పారు. ప్రస్తుతం డిటిఎస్ వర్క్ జరుగుతోందనీ, ఎన్నికల అనంతరం 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో డాక్టర్ శివప్రసాద్, జీవా, హర్షవర్దన్, శ్రీనివాస్, కమల్ తదితరులు నటించారు. అరుణ్ రచన, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, మంత్ర ఆనంద్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|