ఎన్టీఆర్ పై కుట్ర పన్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా యాక్సిడెంట్ కు గురికావడం యాదృచ్ఛికమా? లేక ప్రత్యర్థులు పన్నిన కుట్రలో భాగమా?. ప్రస్తుతం ఇది జనంలో ఓ చర్చనీయాంశమవుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తున్నారని ఒకసారి, కాదని మరోసారి ఇలా మొదట్లో రకరకాల కథనాలు వినిపించాయి. అసలు నిజానిజాలు ఏవో నిగ్గుతేలే లోపు...ఎన్టీఆర్ క్రమంగా కోలుకుంటున్న దశలో ఇప్పుడు ఓ కొత్త కోణం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ పై చేతబడి జరిగిందనీ, నాగభైరవ పూజలు చేయించిన ఫలితమే ఆయనను ప్రమాదంలోకి నెట్టిందనీ, అయితే ఆయన ఆయుష్షు గట్టిది కాబట్టి మృత్యుంజయుడయ్యాడనీ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. నాలుగైదు రోజుల క్రితమే యంగ్ టైగర్ బెడ్ మీద నుంచే మీడియా ముందు గర్జించిన తరుణంలో ఇలాంటి కథనాలు బయటకు రావడం పలువురుని ఆశ్చర్యంలో ముంచెత్తితే, ఎన్నికల వేళ ఇలాంటి కథనాలు సంచలనం సృష్టించడానికే కావచ్చనే అభిప్రాయానికి తావిస్తోంది.
ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగిన సంఘటనను నిశితంగా పరిశీలించిన శాస్త్ర పండితులు కొందరు ఇది కేరళలోని కొందరు క్షుద్రోపాసకులు (అఘోరాలు) చేసిన కాలభైరవ ప్రయోగమేననే అభిప్రాయంతో ఉన్నట్టు ఓ వార్తా కథనం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ వాహనానికి కుక్క అడ్డుపడటమే ఇందుకు నిదర్శనమట. కేరళలోని తిరుచూరులో ఈ ప్రయోగం జరిగి ఉండొచ్చనీ, ఇందుకు 35 లక్షల వరకూ ఖర్చవుతుందనీ వీరి అంచనా. దీనికి ప్రాయశ్చిత్తం చేయించుకోవడం అనివార్యమని వారంటున్నారు. కాలభైరవ ప్రయోగానికి విరుగుడు రుద్ర యాగమనీ, 11 రోజుల పాటు ఈ యాగం చేయిస్తే ప్రాయశ్చిత్తమవుతుందనీ, ఎన్టీఆర్ అజేయుడవుతాడని అంటున్నారు. ఎన్టీఆర్ కు ప్రస్తుతం పూర్తి స్వస్థత చేకూరనప్పటికీ డ్రస్ ఛేంజ్ చేసుకోవడం, చిన్నచిన్న పనులు చేసుకోవడం చేస్తున్నారు. పూర్తిగా కోలుకోవడానికి మరెంతో వ్యవధి కూడా పట్టకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. గురువారంనాడు తన ఓటు హక్కును కూడా ఆయన సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు తొలి విడత ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ఉందనగా ఎన్టీఆర్ పై క్షుద్ర ప్రయోగం వార్తలు వెలువడటం కొందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కేవలం ఆయన వాగ్దాటికి భయపడే ప్రత్యర్థులు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారనడం వింతగానే ఉందనీ, ఎన్టీఆర్ ఎపిసోడ్ నుంచి సింపతీ కోసమే ఇలాంటి ప్రచారం జరిగి ఉండొచ్చనే వాదననూ కొట్టిపారేయలేమనీ కొందరు విశ్లేషిస్తున్నారు. ఏదిఏమైనా 'బుడ్డోడు' చిన్న వయస్సులోనే ఎక్కువ భారం నెత్తిన వేసుకుని ఆరోగ్యం చెడగొట్టుకున్నాడనే అభిప్రాయం మాత్రం అందరి నుంచీ వినిపిస్తోంది.
Read 5 Comment(s) posted so far on this News / Article!
|