కృష్ణవంశీతో రవితేజ 'ఫైట్'
లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాననే డైలాగ్ తరహాలోనే రవితేజ ఆలస్యంగా హీరో అయినా మాస్ హీరోగా తన డిమాండ్ ను పెంచుకుంటూనే ఉన్నారు. ఇటీవల 'బలాదూర్', 'నేనింతే' వంటి ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నప్పటికీ ఆయన డేట్స్ ఇస్తే చాలు...వెంటనే సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చే దర్శకనిర్మాతలకు మాత్రం కొదవలేదు. రవితేజ సైతం తన కెరీర్ ను మలుపుతిప్పిన సీనియర్ డైరెక్టర్లతో పనిచేసేందుకు ఎప్పుడూ ఉత్సాహం కనబరుస్తుంటారు. 'సింధూరం', 'ఖడ్గం' చిత్రాలతో నటుడిగా తనకు మంచి బ్రేక్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో మరోసారి పనిచేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల తాజా ముచ్చట.
కృష్ణవంశీ ప్రస్తుతం శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 'మహాత్మ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది శ్రీకాంత్ 100వ చిత్రం కావడం విశేషం. రవితేజ సైతం 'ఆంజనేయులు' అనే చిత్రానికి కమిట్ అయ్యారు. నటుడు గణేష్ నిర్మాతగా మారి రూపొందిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ ('యువత' ఫేమ్) దర్శకుడు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఇక రవితేజ-ఇలియానా జంటగా సురేందర్ రెడ్డి ('అతిథి' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న 'కిక్' చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటూ మే లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రవితేజ-కృష్ణవంశీ కాంబినేషన్ లో ఓ కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు ఓ ప్రముఖ నిర్మాత సన్నాహాలు మొదలుపెట్టారు. దీనికి 'ఫైట్' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందనీ, జూలైలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారనీ తెలుస్తోంది. అన్నట్టు...సీనియర్ దర్శకుడు వంశీ సైతం రవితేజ హీరోగా 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రాన్ని తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజేంద్రప్రసాద్ 'లేడీస్ టైలర్'కు సీక్వెల్.
Be first to comment on this News / Article!
|