ప్రభాస్ కు సరిజోడి ఎవరు?
'బిల్లా ' చిత్రానికి పాక్షికమైన స్పందనే వచ్చినా అగ్రహీరోల సినిమాలేవీ లేకపోవడం, ఆ తర్వాత విడుదల సినిమాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో ప్రభాస్ సైతం ఆ చిత్రం ప్రమోషన్ వర్క్ కు నడుం బిగిస్తున్నారు. మరోవైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏక్ నిరంజన్' షూటంగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు చిత్రానికి కూడా కమిట్ కావడంతో ప్రభాస్ అందుకు కూడా రెడీ అవుతున్నారు. దీనికి దశరథ్ ('సంతోషం' ఫేమ్) దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. యంగ్ హీరోయిన్ కాజల్, గ్లామర్ గాళ్ ఇలియానాలలో ఒకరిని హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.
విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ తన 'మున్నా' హీరోయిన్ ఇలాయానా వైపు మొగ్గుచూపుతున్నారట. అయితే దశరథ్ మాత్రం కాజల్ అయితే టైమ్లీగా బాగుంటుందనీ, ప్రస్తుతం రామ్ చరణ్ 'మగధీర'లోనూ, అల్లు అర్జున్ 'ఆర్య-2'లోనూ కాజల్ నటిస్తుండటం, ఆ రెండూ క్రేజీ సినిమాలే కావడంతో తమ సినిమాకి కాజల్ అయితే అడ్వాంటేజ్ అవుతుందని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. దిల్ రాజు మాత్రం ఇద్దరిలో ఎవరి ఛాయెస్ అయినా ఫరవాలేదనీ, అయితే పక్కా డేట్లు మాత్రం అవసరమనీ తేల్చిచెబుతున్నారని అంటున్నారు. దశరథ్ ఈ చిత్రానికి చాలా మంచి కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది. జూలై మొదటివారంలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా నితిన్ తో 'మిర్చి', విష్ణువర్దన్ బాబుతో 'సలీమ్' చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్ తో మరోసారి కలిసి నటించే అవకాశం ఇలియానా అందుకుంటుందా, కాజల్ తన్నుకుపోతుందా అనేది చూడాలి.
Be first to comment on this News / Article!
|