నారా హీరోతో తమన్నా
నందమూరి హీరోలకు తోడు ఇప్పుడు నారా వారి ఇంటి నుంచి కూడా ఓ హీరో తెలుగుతెరకు పరిచయమవుతున్నారు. ఆ యువ కథానాయకుడి పేరు నారా రోహిత్. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి స్వయానా సోదరుడైన నారా రామ్మూర్తి నాయుడు తనయుడే ఈ రోహిత్. ఇతని అరంగేట్రానికి రంగం కూడా సిద్ధమయింది. గతంలో మహేష్ ను 'రాజకుమారుడు' తోనూ, రామ్ చరణ్ ను 'చిరుత' గానూ పరిచయం చేసిన వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ ఇప్పుడు రోహిత్ ను తెలుగుతెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. తమ్ముడు రామ్మూర్తిని బుజ్జగించేందుకే రోహిత్ బాధ్యతను దత్ కు చంద్రబాబు అప్పగించారనే ప్రచారం కొద్దికాలంగా జరుగుతున్నదే. రోహిత్ లాంచింగ్ ను అశ్వనీదత్ సైతం అంత ఆషామాషీగా తీసుకోవడం లేదనీ, అందులో భాగంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమన్నాను రోహిత్ కు జోడిగా ఎంపిక చేశారనీ తెలుస్తోంది.
'హ్యాపీడేస్', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'ఆనంద తాండవం' వంటి చిత్రాలతో యూత్ కు దగ్గరైన తమన్నా ఇప్పుడు తమిళంలోనూ మంచి డిమాండ్ లో ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకునే సోలో హీరోయిన్ గా తమన్నాను అశ్వనీదత్ ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా దంతులూరి చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'హ్యాపీడేస్' ఫేమ్ నిఖిల్ 'బసంతి' అనే చిత్రాన్ని చైతన్య ఇటీవల ప్లాన్ చేశారు. అయితే అది ఇంకా కార్యరూపంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో వైజయంతీ బ్యానర్ నుంచి అవకాశం రావడాన్ని ఆయన ప్రిస్టేజియస్ గా తీసుకోనున్నారు. ఈనెల 27న ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. దత్ చిరకాల స్నేహితుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|