తెలుగు సినిమాకు సరిగొత్త 'గమ్యం' చూపించి ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న క్రిష్ కొద్ది గ్యాప్ తర్వాత ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వరుస సినిమాలకు రెడీ అవుతున్నారు. ఈ గ్యాప్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా అశ్వనీదత్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు క్రిష్ చాలా కసరత్తు చేశారు. అయితే కారణాంతరాల వల్ల ఆ ప్రాజెక్ట్ వెనకబాట పట్టింది. దీంతో క్రిష్ అంతా కొత్త తారలతో 'వేగం' అనే చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో దర్శకుడిగా ఏడాదికి పైగా వచ్చిన గ్యాప్ ను భర్తీ చేసేందుకు మరో సినిమాకి కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. అయితే 'వేగం' తర్వాతే ఆ సినిమా ఉంటుందనీ, అందులో సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రాణా హీరోగా నటించనున్నారనీ ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమాచారం.
దగ్గుబాటి రాణా ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏవియం సంస్థ నిర్మిస్తున్న చిత్రం ద్వారా హీరోగా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి 'లీడర్ ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రచారార్భాటలకు దూరంగా ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. తొలి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే మలి సినిమాకు క్రిష్ వంటి క్రియేటివ్ డైరెక్టర్ చిత్రంలో ఆఫర్ రావడం ద్వారా యువతరం హీరోలకు రాబోయే రోజుల్లో దగ్గుబాటు రాజా గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనే చెప్పొచ్చు.