పిల్లల 'సర్కస్ సర్కస్' 24న
సమ్మర్ ఎండల్లో చిన్నారులకు, ఆటవిడుపుగా పెద్దలకూ వినోదం పంచేందుకు సగిటేరియన్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'సర్కస్ సర్కస్'. చిట్టిబాబు, లహరి తల్లిదండ్రులుగా నటించిన ఈ చిత్రంలో బాలనటులుగా శ్రీధర్, చాందిని, అజయ్, ఉషశ్రీ, మానిష్ నటించారు. ఈ చిత్రాన్ని ఈనెల 24న సురేష్ మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నట్టు దర్శకుడు ఉమేష్ కుమార్ తెలిపారు. రామానాయుడు స్టూడియోస్ లో శనివారం ఈ చిత్రంలోని పాటలను మీడియాకు ప్రదర్శించారు.
తెలుగులో బాలలపై మంచి చిత్రాన్ని తీయాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించామనీ, నలుగురు చిన్నారులు చేసే సాహసకృత్యాలే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తమనీ ఉమేష్ కుమార్ తెలిపారు. సర్కస్ లో జరిగే విశేషాలతో పాటు ఇందులో సస్పెన్స్ గొలిపే అంశాలు కూడా ఉన్నాయని అన్నారు. శరత్ ఫోటోగ్రఫీ చూడముచ్చటగా ఉంటుందన్నారు. పిల్లలకు 50 శాతం తగ్గింపు ధరలతో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. నటుడు చిట్టిబాబు మాట్లాడుతూ, గతంలో చక్కటి ప్రజాదరణ చూరగొన్న 'పాపం పసివాడు', 'సిసింద్రీ చిట్టిబాబు' చిత్రాల తరహాలో ఈ సినిమా ఉంటుందనీ, పిల్లల సినిమా అయినా కూడా పెద్దవాళ్లు కూడా చూడదగిన చిత్రమని తెలిపారు. ఇందులో తనకు రెండు పాటలు ఉన్నట్టు బాలనటి ఉషశ్రీ తెలిపింది. అందరూ చూడాల్సిన చిత్రమిదని పేర్కొంది. ఈ చిత్రానికి ఉమేష్ కుమార్ కథ-స్క్రీన్ ప్లే సైతం అదించగా, మనోజ్ బన్సాల్-ఉమేష్ మాటలు, మంజు ఎడిటింగ్, శ్యామ్-దాస్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|