'లీడర్' కూడా లీకయింది!
ఈ ఏడాది స్టార్ ఫ్యామిలీస్ నుంచి ఇద్దరు నట వారసులు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సహజంగానే పరిశ్రమలోనూ, ఇండస్ట్రీలోనూ ఉత్సుకత పెరుగుతోంది. అక్కినేని నాగశ్వరరావు మనువడు, నాగార్జున తనయుడు అయిన నాగచైతన్య ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్న 'జోష్' (వర్కింగ్ టైటిల్ ) ద్వారా అతి తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాస్త అటూఇటుగా ఈ ఏడాదే దక్కుబాటి రాణా కూడా తొలిసారి ప్రేక్షకుల తీర్పు కోరబోతున్నారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడికి మనువడే ఈ రాణా. అంటే సురేష్ బాబు తనయుడన్నమాట. ఈ రెండూ ప్రిస్టేజియస్ చిత్రాలే కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ప్రోగ్రస్ జరుగుతోంది. రాణా తొలి సినిమా ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ లో రూపొందుతుండటం విశేషమైతే, ఫెయిల్యూర్స్ ఎరుగని టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల 'హ్యాపీడేస్' వంటి సంచనల హిట్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. టైటిల్ ను బట్టి ఇది రాజకీయ నేపథ్యంలో ఉంటుందనీ, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదనే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందనీ సమాచారం. అనూహ్యంగా ఈ చిత్రంలో హాస్టిటల్ సన్నివేశానికి చెందిన స్టిల్స్ లీక్ కావడం పలువురుని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
సినిమా ప్రోగ్రస్ లో ఉండగానే సాంగ్స్ లీక్ కావడం, వర్కింగ్ స్టిల్స్ బయటకు రావడం ఇటీవల కాలంలో కామన్ అయింది. కారణాలు ఏవైనా శేఖర్ కమ్ముల సినిమాకు సంబంధించి స్టిల్స్ లీక్ కావడం మాత్రం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి నానక్ రామ్ గూడలో అసెంబ్లీ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇందులో ముఖ్యమంత్రిగా సుమన్, ఆయన తనయుడుగా రాణా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తన సినిమాల్లో కొత్త వారిని పరిచయం చేయడంలో సిద్ధహస్తుడైన శేఖర్ కమ్ముల ఈసారి రాణాకు జోడిగా ప్రియా ఆనంద్ అనే ఎన్ఆర్ ఐ అమ్మాయిని ఎంపిక చేశారనీ, అమెరికాకు చెందిన ప్రియా తెలుగు, తమిళం అనర్ఘళంగా మాట్లాడగలదనీ తెలుస్తోంది. మరో పాత్రలో రిచా అనే కొత్తమ్మాయి కనిపించనుంది. అలాగే రాణా పాత్ర 'యువ' చిత్రంలో సిద్దార్ధ, సూర్య పాత్రలను పోలి ఉంటుందట. శేఖర్ కమ్ములకు ఇష్టుడైన మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|