'అరుంధతి' మళ్లీ అనుష్కకే
'చంద్రముఖి' అరిగిపోయిన రికార్డు. ఇప్పుడంతా 'అరుంధతి' సీజన్. జేజమ్మకు జేజేలు పట్టేస్తూ పలు సినిమాల్లో కామెడీ ట్రాక్ లు అల్లేస్తున్నారు. ఛానెల్ ప్రోగ్రామ్స్ సరేసరి. ఈ ఏడాది ఇంతవరకూ తెలుగులో విడుదలైన చిత్రాల్లో అతి పెద్ద సక్సెస్ ను దక్కించుకున్న 'అరుంధతి' చిత్రాన్ని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఇటీవల తమిళంలోనూ విడుదల చేశారు. అక్కడ సైతం మంచి విజయాన్నే చవిచూసింది. ఈ చిత్రాన్నిహిందీలో రీమేక్ చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. 'గజనీ' చిత్ర నిర్మాతల్లో ఒకరైన మధు మాంటెనా ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం గట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ శ్యాంప్రసాద్ సొంతగానే నిర్మించేందుకు నిశ్చయించినట్టు తెలుస్తోంది. తాజాగా హీరోయిన్ అన్వేషణ జరుగుతోంది. తొలుత అనుష్క శర్మ ('రబ్ నే బనా ది జోడి' ఫేమ్) పేరు పరిశీలనలోకి వచ్చినట్టు సినీ వర్గాల సమాచారం. హిందీ వెర్షన్ కాబట్టి యంగ్, డైనమిక్ గా కనిపించే ఉత్తరాది అమ్మాయి కోసం నిర్మాతలు అన్వేషిస్తున్నారనీ, అనుష్క శర్మ పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఆమె 'యష్ రాజ్ ఫిలిమ్స్' కాంట్రాక్స్ లో ఉన్నందున బయట చిత్రానికి అంగీకరించే అవకాశం లేదనే అభిప్రాయంతో నిర్మాత ఉన్నారనీ ఆ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలుగు వెర్షన్ లో నటించిన అనుష్క పేరునే ఫైనలైజ్ చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు.
'బొమ్మాళీ నిన్ను వదలా' అంటూ తెలుగు వెర్షన్ లో విలనీ పాత్ర పోషించిన సోనూ సూద్ హిందీలోనూ అదే పాత్రకు ఎంపికయ్యారు. దర్శకుడి విషయంలోనూ పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తెలుగు వెర్షన్ చేసిన కోడి రామకృష్ణకు హిందీ భాషలో ప్రావీణ్యం లేకపోవడంతో ప్రియదర్శన్ ను సంప్రదించారనీ, అయితే సమయాభావం వల్ల ఆయన ఈ ఆఫర్ అంగీకరించే అవకాశాలు లేవనీ తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కు స్పెషల్ ఎఫెక్ట్ అందించిన రాహుల్ ను దర్శకుడిగా ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓవరాల్ గా...అనుష్క బాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగగమైనట్టే...
Be first to comment on this News / Article!
|