'చక్ దే'పై నాగార్జున కన్ను
మాస్...బాస్..కింగ్. ఆ తర్వాతో? యువసామ్రాట్ నాగార్జున అభిమానులకు కూడా ఈ విషయం ఆసక్తి కలిగిస్తోంది. 'కింగ్' చిత్రం ఇటీవల విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ నాగార్జున తదుపరి చిత్రం ఏమిటనే సస్పెన్స్ కు మాత్రం ఇంకా తెరపడలేదు. నిజానికి 'కింగ్' చిత్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డితో మరో చిత్రం చేయబోతున్నట్టు నాగార్జున ప్రకటించినప్పటికీ ఆ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుంది, స్క్రిప్టు రెడీ అయిందా. దర్శకుడెవరనేది ఇంకా తేలలేదు. శివప్రసాద్ రెడ్డి ఆ పనిలోనే బిజీగా ఉన్నట్టు మాత్రం చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజుతో కలిసి పనిచేసేందుకు నాగార్జున ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది.
గుణ్ణం గంగరాజు 'లిటిల్ సోల్జర్స్', టఅమ్మచెప్పింది' చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. ఇటీవల ఆయన నాగార్జనను కలిసి పలు స్క్రిప్టులు వినిపించారనీ, అయితే నాగార్జున హిందీలో విజయవంతమైన 'ఛక్ దే ఇండియా' సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనీ ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. దీనిని దృష్టిలో పెట్టుకునే గుణ్ణం గంగరాజు స్క్రిప్టు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారనీ, త్వరలోనే దీనికి తుదిరూపం ఇవ్వబోతున్నారనీ తెలుస్తోంది. హాకీ క్రీడా నేపథ్యంలో రూపొందిన 'ఛక్ దే'లో షారూక్ ఖాన్ హాకీ కోచ్ గా నటించారు. షిమిత్ అమిన్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2007 ఆగస్టు 10న విడుదలై ఘన విజయం సాధించింది. దీనికి రీమేక్ గానే నాగార్జున-గుణ్ణం గంగరాజు కాంబినేషన్ చిత్రం ఉంటుందా, లేక ఆ సినిమా స్ఫూర్తితో కొత్తగా సినిమాను ప్రెజెంట్ చేయనున్నారా అనేది వేచిచూడాలి. ఏదిఏమైనా నాగార్జున తదుపరి చిత్రం ఆయన సెంటిమెంట్ కు తగ్గట్టుగానే డిసెంబర్ నాటికి పూర్తయి అదే నెలలో విడుదలయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి.
Be first to comment on this News / Article!
|