యాక్షన్ హీరోగా ప్రకాష్ రాజ్
ఒకే తరహా పాత్రలు ఎన్ని చేసినా ఎప్పటికప్పుడు వైరుధ్యం చూపడంలో ప్రకాష్ రాజ్ కు కొట్టిన పిండి. విలనీ పాత్రల్లో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్న ప్రకాష్ రాజ్ కొన్నేళ్ల క్రితం హీరో కావాలనే కోరికనూ తీర్చుకున్నారు. అయితే హీరోగా ఆయన క్లిక్ కాలేదు. దీంతో మళ్లీ విలనీ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లి పట్టు సాధించారు. ఆసక్తికరంగా ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరోసారి హీరోగా కనిపించబోతున్నారట. ఆషామాషీ హీరోగా మాత్రం కాదు. యాక్షన్ హీరోగానే ఆయన పాత్ర ఉండబోతోందట. ఆ సినిమా నిర్మాత ఎవరో ఊహించండి? గట్స్ ఉన్న నిర్మాతగా వరుస సక్సెస్ లు సాధిస్తున్న దిల్ రాజు.
ప్రకాష్ రాజ్, దిల్ రాజుల మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. దిల్ రాజు సినిమాల్లో ప్రకాష్ రాజ్ కంపల్సరీ. ప్రకాష్ రాజ్ డేట్స్ దొరకడం ఎంత లేటయినా అప్పటివరకూ వెయిట్ చేసి సినిమాలు తీస్తుంటారాయన. ఈమధ్యన ప్రకాష్ రాజ్ సొంతంగా నిర్మించిన 'అభియుమ్ నానుమ్' చిత్రాన్ని తెలుగు వెర్షన్ లో దిల్ రాజు నిర్మించి 'ఆకాశమంత' పేరుతో విడుదల చేశారు. తమిళంలో సినిమా ఫెయిలయినా తెలుగు వెర్షన్ కోసం దిల్ రాజు చేసిన మార్పులు, చేర్పులు మంచి ఫలితాన్నే ఇచ్చింది. రెట్టింపు లాభాలతో సినిమాను బాక్సాఫీస్ సక్సెస్ వైపు నడిపించడంలో దిల్ రాజు సక్సెస్ అయ్యారు. దర్శకుడు రాధామోహన్ కు కూడా సినిమా మంచి పేరునే తెచ్చింది. రాధామోహన్ పనితీరు నచ్చిన దిల్ రాజు మరో ప్రాజెక్ట్ ను కూడా ఆయనకు అప్పగించారనీ, ఇద్దరికీ ఇష్టుడైన ప్రకాష్ రాజ్ ఇందులో లీడ్ రోల్ పోషించనున్నారనీ సినీ వర్గాల భోగట్టా. విమానం హైజాక్ కథాంశంతో హాలీవుడ్ లో విజయవంతమైన ఓ చిత్రం స్ఫూర్తితో ఈ చిత్రం ఉంటుందనీ, ఇందులో ప్రకాష్ రాజ్ యాక్షన్ హీరోగా నటించబోతున్నారనీ సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు తెలుగు భాషలోనే తీయబోతున్నారట. ప్రకాష్ రాజ్ ఒకవేళ ముచ్చటపడితే తమిళంలో ఆయన నిర్మాతగా అవతారమెత్తే అవకాశాలు ఉండొచ్చు. అయితే అధికారికంగా మాత్రం ఈ ప్రాజెక్ట్ వివరాలను దర్శకనిర్మాతలు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
Be first to comment on this News / Article!
|