'బిల్లా'కు 15 కోట్ల షేర్
ఒక సరైన సక్సెస్ కోసం కొద్దికాలంగా ఎదురుచూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు 'బిల్లా' కలెక్షన్లు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదట్లో కొద్దిపాటి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. తొలుత ఎలక్షన్, ఐపిఎల్ సీజన్ వంటివి అవరోధాలుగా నిలిచినప్పటికీ 'బిల్లా' తర్వాత మరే చిత్రమూ పోటీలేకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చి క్రమంగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 21 రోజుల్లో ఈ చిత్రం 15 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. నైజాంలో ఈ చిత్రం 6.5 కోట్లు రాబట్టి రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టగా, గుంటూరు టెరిటరీలో 1.4 కోట్ల రూపాయల షేర్ తో (టోటల్ రన్) ప్రభాస్ 'వర్షం' చిత్రం నెలకొల్పిన రికార్డును 'బిల్లా' 3 వారాల్లోనే బ్రేక్ చేయడం మరో విశేషం. ఎపి షేర్ కు అదనంగా చెన్నై, కర్ణాటకలోనూ ఈ చిత్రం చక్కటి ఆదరణ చూరగొంటోందని ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి.
'బిల్లా' చిత్రం తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనీ, మంచి కలెక్షన్లతో రికార్డుల దిశగా దూసుకువెళ్తోందనీ ప్రభాస్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాల్టి యువతరం హీరోలకు భిన్నంగా ఆయన వరుస సినిమాలతో ఈసారి ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏక్ నిరంజన్' చిత్రం షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు. పూరీ జగన్నాథ్ సమర్పణలో ఆదిత్యరామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో బివిఎస్ ఎన్ ప్రసాద్ (ఛత్రపతి ప్రసాద్ ) నిర్మించనున్న చిత్రానికి, దిల్ రాజు నిర్మాతగా దశరథ్ ('సంతోషం' ఫేమ్) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ప్రభాస్ కమిట్ అయ్యారు. ఈ రెండు చిత్రాలు కూడా ఇదే ఏడాది సెట్స్ పైకి వచ్చే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|