విక్టరీతో మెహర్ రమేష్
దర్శకుడు మెహర్ రమేష్ మరో కొత్త ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నారు. ఆయన తీసిన 'కంత్రి ', 'బిల్లా' చిత్రాలు రికార్డులను తిరగరాయకపోయినా స్టార్ హీరోలను డైరెక్ట్ చేయగల కమర్షియల్ డైరెక్టర్ గా మాత్రం ఆయన పెద్ద హీరోలు, నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డారు. 'బిల్లా' రిలీజ్ కు ముందే పలువురు అడ్వాన్స్ లు ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించేందుకు విక్టరీ వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పరిశ్రమ వర్గాల భోగట్టా.
హిందీలో విజయవంతమైన ఓ చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో తీస్తే బాగుంటుందని వెంకటేష్., ఆయన సోదరుడు సురేష్ బాబు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి. వెంకటేష్ తన సినిమాల స్క్రిప్టు విషయంలో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సినిమా సినిమాకి మధ్య తన పాత్రలు వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు. ఆయన గత చిత్రం 'చింతకాయల రవి' యావరేజ్ చిత్రంగా నిలిచింది. దీంతో ఈసారి పెద్ద హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే హ్యాట్రిక్ హిట్ల దర్శకుడు శ్రీనువైట్లతో తన తదుపరి చిత్రానికి ఆయన సుముఖంగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి రావడానికి మరికొంత వ్యవధి పట్టేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో మెహర్ రమేష్ పేరు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఇదే వెంకీ తదుపరి ప్రాజెక్ట్ కావచ్చా అనేది మరికొద్ది రోజుల్లోనో ఫైనలైజ్ అవుతుంది. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తూ నిర్మిస్తున్న 'ఈనాడు' చిత్రంలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మంచి స్క్రిప్టు దొరికితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ వచ్చే ఏడాది ఓ సినిమా చేయాలనే ఆలోచనలో వెంకటేష్ ఉన్నారు.
Be first to comment on this News / Article!
|