'చంటి'తో 'కేక' పెట్టిస్తాడట!
పోయిన చేటే వెతుక్కోవాలంటారు. దర్శకుడు తేజ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. 'చిత్రం', 'జయం', 'నువ్వు నేను' వంటి సెన్సేషన్ హిట్లు ఇచ్చిన తేజ గత కొన్నేళ్లుగా తన ఛార్మ్ ను కోల్పోతూ వచ్చారు. 'ధైర్యం', 'ఔనన్నా కాదన్నా', 'ఒక విచిత్రం' వంటి వరుస ఫ్లాపులు ఆయనను కోలుకోలేకుండా చేశాయి. దీంతో రెండేళ్ల పాటు తన సినిమాలు, ఫ్లాపులను విశ్లేషించుకుని ఇటీవల 'కేక' చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రేక్షకులు పట్టరాని సంతోషంతో కేక వేస్తారని అనుకున్నారే కానీ, భయంతో కేకలు వేసి థియేటర్లకు దూరమవుతారని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. అయితే జరిగిందదే. దీంతో కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న తేజ ఇప్పుడు రెట్టించిన పట్టుదలతో పూర్వవైభవం కోసం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా విక్టరీ వెంకటేష్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ కెరీర్ కు అప్పట్లో సరైన బ్రేక్ ఇచ్చిన 'చంటి' చిత్రానికి ఇది సీక్వెల్ గా ఉండబోతోందని తెలుస్తోంది.
తేజ 'జయం' సంచలన విజయం సాధించిన తరుణంలో ఆయనతో వెంకటేష్ కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే అది కార్యరూపంలోకి రాలేదు. ఇటీవల కాలంలో తేజ, దగ్గుబాటు సురేష్ బాబు సంయుక్తంగా కొత్త టాలెంట్ తో సినిమాలు తీయాలనుకున్నప్పటికీ అది కూడా పూర్తిగా నెరవేరలేదు. ఈ నేపథ్యంలో తేజ ఇటీవల వెంకటేష్ ను కలుసుకుని, స్క్రిప్టు వినిపించారనీ, ఆయన ఎంతో ఇంప్రెస్ అయ్యారనీ తెలుస్తోంది. వెంకటేష్ కు కథ నచ్చితే సురేష్ బాబు నిర్మాణ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగానే ఉన్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక సమాచారం మాత్రం ఇంకా బయటకు రావలసి ఉంది.
Be first to comment on this News / Article!
|