'మల్లన్న' మరింత లేటు!
ఇదిగో అదిగో అంటూ ఏడాదిన్నరకు పైగా షూటింగ్ జరుపుకొంటూ వస్తున్న చియాన్ విక్రమ్ 'మల్లన్న' చిత్రం మళ్లీ వాయిదా పడింది. తమిళంలో 'కందస్వామి' పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. సుశీ గణేషన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కలైపులి ధాను ఈ చిత్రాన్ని 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్కంగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ ఐదు విలక్షణ పాత్రల్లో కనిపించనుండగా, ఆయనకు జోడిగా అందాల నటి శ్రియ నటిస్తోంది. సినిమా ముహర్తానికి సంబంధించి ఇన్విటేషన్ దగ్గర నుంచి ఈమధ్యనే విడుదల చేసిన ట్రైలర్స్ వరకూ దర్శకనిర్మాతలు తమ ప్రత్యేకతను చాటుకోవడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 'అపరిచితుడు' తర్వాత మళ్లీ అంతకుమించిన స్థాయిలో తనకు ఈ చిత్రం మంచి పేరు తెస్తుందని విక్రమ్ సైతం ధీమాగా ఉన్నారు. తొలిసారిగా ఈ చిత్రంలోని అన్ని పాటలకూ విక్రమ నేపథ్యగానం అదించడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నప్పటుకీ గ్రాఫిక్స్, యానిమేషన్ వర్క్ కు మరికొంత వ్యవధి అవసరం కావడంతో జూన్ కు రిలీజ్ వాయిదా వేశారని తెలుస్తోంది.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 26న ఆడియో, మే 29న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం మారిన షెడ్యూల్ ప్రకారం మే 10న ఆడియో, జూన్ 12న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దక్షిణాదిలో తొలి సూపర్ హీరో ఫిల్మ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, చివరి నిమిషంలో హడావిడి పడటం కంటే క్వాలిటీ పరంగా సంతృప్తి చెందిన తర్వాతే రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతల అభిప్రాయంగా తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంగ్లీషు, స్పానిష్, ఇటాలియన్ భాషల్లోనూ సినిమా రిలీజ్ చేయాలనే యోచనలో నిర్మాత థాను ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, ఇంద్రజిత్ సుకుమారన్, ప్రభు గణేషన్, వివేక్, వడివేలు తదితరులు నటిస్తున్నారు. ఎస్.కె.ఏకాంబరం సినిమాటోగ్రఫీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|