ప్రతినాయకుడుగా శ్రీహరి
ప్రతినాయకులుగా కెరీర్ ప్రారంభించి హీరోగా స్థిరపడిన వారిలో రియల్ స్టార్ శ్రీహరి కూడా ఒకరు. తొలినాళ్లలో కామెడీ విలన్ గా మంచిపేరు తెచ్చుకున్న శ్రీహరి ఆ తర్వాత హీరోగా మారి 'పోలీస్', 'భద్రాచలం', 'హనుమంతు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు అందించారు. నిర్మాతగా కూడా సినిమాలు తీశారు. ఇటీవల కాలంలో హీరోగా అడపాదడపా నటిస్తూనే క్యారెక్టర్ పాత్రల వైపు మళ్లారాయన. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'చిత్రంలో ఆయన చేసిన క్యారెక్టర్ రోల్ సినిమా విజయంలో కీలకం కావడంతో శ్రీహరి స్పెషల్ రోల్ పోషిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ బలపడింది. ఇటీవల విడుదలైన 'ఢీ', 'కింగ్' వంటి చిత్రాల విజయంలో ఆయనకూ వాటా ఉంది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ 'మగధీర' చిత్రంతో సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషిస్తున్నారు. పనిలో పనిగా మరోసారి ప్రతినాయకుడిగా కూడా శ్రీహరి నటించడానికి సిద్ధపడుతున్నారు. అయితే తెలుగులో కాకుండా ఓ తమిళ చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా కనిపించనుండటం విశేషం.
తమిళంలో విజయ్, అనుష్క జంటగా ఎవిఎం బ్యానర్ పై రూపొందుతున్న చిత్రంలో విలన్ గా నటించేందుకు శ్రీహరి అగ్రిమెంట్ చేసినట్టు సమాచారం. ఇటీవల కాలంలో కోట శ్రీనివాసరావు, సుమన్, సాయికుమార్ వంటి ఆర్టిస్టులు తమిళంలో విలనీ పాత్రలు పోషించి తమ సత్తా చాటుకున్నారు. రజనీకాంత్ 'శివాజీ' చిత్రంలో సుమన్ పూర్తి స్థాయి విలన్ పాత్ర పోషించి మంచిపేరు తెచ్చుకున్నారు. సుమన్ తరహాలోనే శ్రీహరి సైతం ప్రతినాయకుడిగా తమిళ తంబీల మన్ననలు అందుకుంటారని ఆశించవచ్చు.
Be first to comment on this News / Article!
|