'కిక్' కథేమిటి?
సమ్మర్ సీజన్ లో ఇంతవరకూ ప్రేక్షకుడికి సరైన కిక్ రాలేదనీ, ఇప్పుడు ఆ కొరతను తమ 'కిక్' చిత్రం తీరుస్తుందనీ ఆ చిత్ర దర్శకనిర్మాతలు ఢంకా బజాయిస్తున్నారు. రవితేజ, ఇలియానా జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'అతనొక్కడే', 'అశోక్', 'అతిథి' చిత్రాల తర్వాత సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం కూడా సహజంగా సినిమాపై మంచి అంచనాలనే రేకెత్తిస్తోంది. ఇప్పటికే థియేటర్లలో చూపిస్తున్న 'కిక్' ట్రయిలర్స్ కు కూడా మంచి రెస్పాన్సే వస్తోంది. ఇంతకూ సినిమాలో రవితేజ ఇవ్వబోయే 'కిక్' ఏంటి? అసలా టైటిల్ వెనుక కథేంటి అని ఆరాతీస్తే కొంత సమాచారం బయటకువచ్చింది.
కథానాయకుడు రవితేజ ఏ పనిచేసినా అందులో కిక్ ఉండాల్సిందేనని చెబుతుంటాడు. అందరూ చేసిన దానికి భిన్నంగా చేయడమే ఆయన ఆశించే కిక్ అన్నమాట. ఇక కథలో ఇలియానా, శ్యామ్ పాత్రలు కూడా కీలకమైనవే. శ్యామ్ ఓ పోలీస్ ఆఫీసర్. అతనికీ, ఇలియానాకూ పెళ్లిచూపులతో కథ మొదలవుతుంది. ఒకరి గురించి మరొకరు పరిచయం చేసుకునే సమయంలో ఇద్దరికీ చెరో లక్ష్యం ఉంటుందనే విషయం బయటకు వస్తుంది. తన పెళ్లిలోగా ఓ వ్యక్తిని పట్టుకుని తీరాలని శ్యామ్ చెబితే, తాను కూడా ఓ వ్యక్తికి గుణపాఠం చెప్పాలనుకుంటున్నట్టు ఇలియానా చెబుతుంది. ఆసక్తికరంగా ఈ ఇద్దరూ కోరుకుంటున్న ఆ వ్యక్తే రవితేజ. ఇంతకూ రవితేజ ఆ ఇద్దరికీ ఇచ్చిన కిక్ ఏమిటి? దాని పర్వససానం ఏమిటనేది ఎంటర్ టైన మెంట్ పంథాలో దర్శకుడు తెరకెక్కించారట. ఇటలీ, ఆస్ట్రియా, మలేసియాలోలలో తీసిన పాటలు, కొంత టాకీ, ఛేజ్ వంటివి ప్రత్యేక ఆకర్షణలుగా నిలువనున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రసూల్ అందించిన ఛాయాగ్రహణం, థామస్ సంగీతం కూడా హైలైట్స్ గా చెబుతున్నారు. అబ్బూరి రవి-వక్కంతం వంశీ మాటలు, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు అందించారు. ఈనెల 8న 'కిక్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Be first to comment on this News / Article!
|