'బొబ్బిలిపులి' రీమేక్
దర్శకరత్న దాసరి ప్రతి బర్త్ డేకి ఆయన కొత్త నిర్ణయాలు తీసుకోవడం, అవి ఎప్పటికప్పుడు సంచలనం సృష్టించేవిగా ఉండటం రివాజు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆచరణలోకి రాని సందర్భాలు కూడా అడపాదడపా లేకపోలేదు. ఆమాటెలా ఉన్నా...ఇంతవరకూ 148 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి త్వరలోనే 150 మార్క్ ని చేరాలనే పట్టుదలతో ఉన్నారు. కొంత కాలంగా నటనకు, దర్శకత్వ శాఖకు దూరంగా ఉంటూ, కేవలం నిర్మాణానికే పరిమితమవుతున్న దాసరి ఇటీవల 'మేస్త్రి' చిత్రంలో నటించారు. ఇప్పుడు మళ్లీ కెమెరా వెనక్కి వెళ్లబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం ఉంటుందని దాసరి తన 63వ బర్త్ డే సందర్భంగా ఇటీవల ప్రకటించారు. దీంతో దాసరి దర్శకత్వం వహించబోయే సినిమా ఏ హీరోతో ఉండబోతోంది? ఎలాంటి సంచలన కాంబినేషన్ కాబోతోందనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం దాసరి తదుపరి చిత్రంలో యువరత్న బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్నారనీ, 80 వ దశకంలో నటరత్న ఎన్టీఆర్, దాసరి కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్టయిన 'బొబ్బిలిపులి'కి రీమేక్ గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణగా నిలిచిన చిత్రాల్లో 'బొబ్బిలిపులి' కూడా ఒకటని దాసరి తరచు చెబుతుంటారు.
ఎన్టీఆర్ తనయుడైన బాలకృష్ణ మాత్రమే 'బొబ్బిలిపులి' చిత్రం రీమేక్ లో నటించి మెప్పించగలరని భావిస్తున్న దాసరి కొద్దికాలంగా బాలకృష్ణను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా చెబుతారు. ఎట్టేకేలకు ఈ ఆలోచన కార్యరూపంలోకి రాబోతోందనీ, ఇందుకు బాలకృష్ణ సైతం సుముఖంగా ఉన్నారనీ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందులో భాగంగానే దాసరి పుట్టినరోజున స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి బాలకృష్ణ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారనీ ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దర్శకుడిగా దాసరి కమ్ బ్యాగ్ ఫిల్మ్ 'బొబ్బిలిపులి' అవుతుందా అనేది వేచిచూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|