సందడి లేని 'సలీమ్'
మంచు విష్ణువర్దన్ బాబు 'సలీమ్' చిత్రం ఎంతవరకు వచ్చింది? కొద్దికాలంగా ఆ సినిమా ప్రోగ్రస్ గురించి అసలు ఏ సమాచారమూ బయటకు రావడం లేదెందుకు? అసలు ఏమి జరిగి ఉంటుంది? ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో కొద్దిరోజులుగా ఈ ముచ్చట చర్చనీయాంశమవుతోంది. 'ఢీ' చిత్రంతో తొలి సక్సెస్ సాధించిన విష్ణు ఆ తర్వాత వచ్చిన 'కృష్ణార్జున' చతికిల పడటంతో మళ్లీ సరైన హిట్ కోసం గట్టి పట్టుదలగా ఉన్నారు. వై.వి.ఎస్. చౌదరి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఏటికేడాది సినిమాను చిత్రిక పట్టి ప్రేక్షకుల ముందుకు సినిమాలు తెచ్చే చౌదరి ఆమధ్యన 'దేవదాసు' వంటి సెన్సేషన్ హిట్టిచ్చారు. అదే ఊపులో గత ఏడాది బాలకృష్ణతో 'ఒక్కమగాడు' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి చేతులు కాల్చుకున్నారు. దీంతో చౌదరి మళ్లీ అంతర్మథనంలో పట్టారు. ఎట్టకేలకు తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీనే ఎంచుకుని శ్రీ లక్ష్మిప్రసన్న బ్యానర్ పై 50వ చిత్రంగా 'సలీమ్'కు గత ఏడాది సెప్టెంబర్ లో శ్రీకారం చుట్టారు. విష్ణుకు జోడిగా ఇలియానాను ఎంపిక చేశారు. ఆ తర్వాత నుంచి సినిమా ప్రోగ్రస్ ఏమిటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. సజావుగా షూటింగ్ ప్రారంభమైనా ఈమధ్యన బ్రేక్ పడినట్టు సినీ వర్గాల భోగట్టా.
విష్ణువర్దన్ నిశ్చితార్థం, ఆ తర్వాత వివాహం, హనీమూన్ వంటి కారణాల వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందని చెబుతున్నారు. దీనికితోడు విష్ణువర్దన్ తన బరువు తగ్గించుకుని మరీ పీలగా ఉండటం కూడా ఓ అవరోధంగా నిలిచిందని అంటున్నారు. పాత్ర డిమాండ్ మేరకు విష్ణు కొంత వెయిట్ పెంచుకోవాలని చౌదరి సూచించినట్టు కూడా చెబుతున్నారు. ఇందులో నిజానిజాల మాటెలా ఉన్నా 'సలీమ్' నుంచి ప్రస్తుతం ఎలాంటి సందడి కనిపించడం లేదు.
Be first to comment on this News / Article!
|