'కింగ్' సక్సెస్ తర్వాత నాగార్జున కొత్త చిత్రం ఏమై ఉంటుందనే ఉత్సుకత అందిరిలోనూ కనిపిస్తోంది. నాగార్జునతో ఓ చిత్రాన్ని చేసేందుకు హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల సిద్ధంగా ఉన్నప్పటికీ ఇందుకు మరికొంత వ్యవధి పట్టే అవకాశాలున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు సైతం నాగార్జునతో 'చక్ దే ఇండియా' రీమేక్ కు స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నాగార్జున తదుపరి చిత్రం మళ్లీ కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పైనే ఉండబోతోంది. 'కింగ్' విజయోత్సవంలో భాగంగా మళ్లీ కామాక్షి కళా మూవీస్ కు మరో చిత్రం చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించడంతో నిర్మాత శివప్రసాద్ రెడ్డిగా అందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా పరశురామ్ ను ఎంపిక చేసినట్టు తెలిసింది.
తొలిచిత్రం 'యువత'తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పరశురామ్ ప్రస్తుతం రవితేజ హీరోగా 'ఆంజనేయులు' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. మరోవైపు నాగార్జున సైతం తన కుమారుడు నాగచైతన్యను పరిచయం పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న 'జోష్' ప్రోగ్రస్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జూలై లో ఈ చిత్రం విడుదలవుతుందనీ, అనంతరమే నాగార్జున మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటారనీ చెబుతున్నారు. నాగార్జునకు సక్సెస్ సెంటిమెంట్ పరంగా డిసెంబర్ రిలీజ్ ను టార్గెట్ చేసుకుని నాగార్జున-పరశురామ్ కాంబినేషన్ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు శివప్రసాద్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.