సుశాంత్ 'కరెంట్' 21న
నట వారసులకు తొలిచిత్రం నల్లేరు మీద నడకే అవుతుంది. అయితే మలి చిత్రం నుంచి తనకంటూ ప్రత్యేకమైన ఐటెండిటీ తెచ్చుకున్నప్పుడే కెరీర్ ఆశాజనంగా ఉంటుంది. 'కాళిదాసు' చిత్రంతో హీరోగా పరిచయమైన నాగార్జున మేనల్లుడు సుశాంత్ ఆ సినిమాతో యావరేజ్ మార్కులు తెచ్చుకున్నారు. ఫైట్స్, డాన్స్ లలో రాణించిన సుశాంత్ హావభావాలు, లుక్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిని దృష్టిలో పెట్టుకునే సుశాంత్ ఈసారి గెటప్ లో కొద్దిపాటి మార్పులు చేసుకుని తాజాగా 'కరెంట్' చిత్రంతో ప్రేక్షకుల తీర్పు కోరబోతున్నారు. శ్రీ నాగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఈనెల 21న విడుదలకు సిద్ధమవుతోంది.
యాక్షన్ తో కూడిన యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని యువదర్శకుడు సూర్యప్రతాప్ తెరకెక్కించారు. సుశాంత్ కు జోడిగా గ్లామర్ నటి స్నేహ ఉల్లాల్ నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు ఫారెన్ లోని రిచ్ లొకేషన్లలోనూ, అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్స్ లోనూ, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనూ చిత్రీకరించారు. ఇదో వినూత్నమైన రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ అనీ, సుశాంత్ కెరీర్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందనీ నిర్మాతలు చెబుతున్నారు. ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ఏడాదికి సుమారు 50 చిత్రాలను పంపిణీ చేస్తున్న సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ 'కరెంట్' చిత్రం నైజాం ఏరియా పంపిణీ హక్కులు తీసుకుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే శ్రోతల ఆదరణ చూరగొంటూ సినిమాపై అంచనాలను పెంచింది. తొలి, మలి చిత్రం సొంత బ్యానర్ లోనే చేసిన సుశాంత్ కు 'కరెంట్' మంచి బ్రేక్ ఇచ్చి బయట బ్యానర్లను వరుస ఆఫర్ల వెల్లువెత్తుతాయోమో చూడాలి.
Be first to comment on this News / Article!
|