ఎన్టీఆర్ సరసన పార్వతి?
మహేష్ బాబు 'వరుడు' చిత్రంలో అవకాశం వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో చేజారిపోవడంతో అమెరికా వెళ్లిపోయిన పార్వతి మిల్టన్ ఎట్టకేలకు మళ్లీ టాలీవుడ్ కి తిరిగి వచ్చింది. సమ్మర్ హాలిడేస్ కోసమో...మరో కారణం వల్లనో అమెరికా వెళ్లలేదనీ, తన తల్లికి ఒంట్లో బాగుండకపోవడంతో ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చిందనీ, ఇప్పుడు ఆమెకు పూర్తి స్వస్థత చేకూరడంతో తిరిగి కెరీర్ పై దృష్టి సారించబోతున్నాననీ పార్వతి వివరణ ఇచ్చింది. పలు అట్రాక్టివ్ ఆఫర్లు ప్రస్తుతం తన చేతిలో ఉన్నాయనీ, త్వరలోనే ఫైనలైజ్ చేస్తాననీ ఆమె చెబుతోంది. ఆసక్తికరంగా ఎన్టీఆర్ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా పార్వతి మెల్టన్ కనిపించనుందట. ఇదే విషయాన్ని పార్వతి తన సన్నిహితులకు సంబరంగా చెబుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల తాజా ముచ్చట. ఎన్టీఆర్ కథానాయకుడిగా నల్లమలుపు బుజ్జి త్వరలోనే ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి హరీష్ శంకర్ ('షాక్' ఫేమ్) దర్శకత్వం వహించనున్నారు. 'ఎమ్మెల్యే' (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే వర్కింగ్ టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉంది.
ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన 'ఆది' చిత్రాన్ని గతంలో నల్లమలుపు బుజ్జి రూపొందించారు. ఇటీవల 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం బుజ్జితో ఉంటుందని ప్రకటించారు. రవితేజతో 'షాక్' చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ ఆ తర్వాత మళ్లీ ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు. 'కొంచెం ఇష్టం...' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ కు నల్లమలుపు బుజ్జి ఈసారి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగానే 'ఎమ్మెల్యే' చిత్రానికి పార్వతి మిల్టన్ తో పాటు మరికొందరి నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వం వహిస్తున్న 'అదుర్స్ ' చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత 'ఎమ్మెల్యే' చిత్రం ప్రారంభమవుతుంది. దిల్ రాజు నిర్మించనున్న మరో చిత్రానికి కూడా ఎన్టీఆర్ కమిట్ అయ్యారు.
Be first to comment on this News / Article!
|