ప్రిన్స్ తో ప్రియమణి
'అతిథి' చిత్రం తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు తన తాజా చిత్రం 'వరుడు' విషయంలో స్టార్ కాస్ట్ నుంచి ప్రతి విషయంలోనూ తగినంత శ్రద్ధ తీసుకుంటున్నారు. 'జల్సా' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం, 'అతడు' తర్వాత రెండోసారి మహేష్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతుండటం మంచి అంచనాలకు తావిస్తోంది. దీనికితోడు 'అరుంధతి', 'బిల్లా' చిత్రాలతో యువతరం హాట్ ఫేవరెట్ గా నిలిచిన అనుష్క తొలిసారి ప్రిన్స్ మహేష్ తో జతకట్టడంతో గ్లామర్ సైడ్ కూడా బలం చేకూరింది. తాజాగా 'వరుడు' టీమ్ లో మరో గ్లామర్ సెన్సేషన్ ప్రియమణి కూడా వచ్చి చేరినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల తాజా భోగట్టా.
తమిళ 'పరుత్తి వీరన్' తో జాతీయ ఉత్తమనటిగా నిరూపించుకున్న ప్రియమణి తెలుగులో 'పెళ్లయిన కొత్తలో', 'యమదొంగ' వంటి హిట్లు సాధించింది. ఇటీవల బాలకృష్ణతో 'మిత్రుడు', నితిన్ తో 'ద్రోణ' వంటి చిత్రాల్లోనూ నటించి తన గ్లామర్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. పనిలో పనిగా ఇటీవల ప్రిన్స్ మహేష్ తో నటించాలనే కోరికను బయటపెట్టింది. అయితే ఇప్పటికే 'వరుడు' లో అనుష్క ప్రధాన హీరోయిన్ గా ఎంపిక కావడంతో ప్రియమణికి చిత్ర దర్శకనిర్మాతలు సెకెండ్ హీరోయిన్ పాత్రను ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవల ఓ ఫోటో సెషన్ లో కూడా ఆమె పాల్గొన్నట్టు సమాచారం. 'బిల్లా'లో అనుష్క, నమిత పోటీపడి అందాలు ప్రదర్శించినట్టే, అనుష్క-ప్రియమణి కలిస్తే 'వరుడు' గ్లామర్ మోతెక్కిపోవడం ఖాయం. సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|