అజయ్ బాటలో సుబ్బరాజు
విలన్ పాత్రలతో కెరీర్ ప్రారంభించి హీరోలుగా స్థిరపడిన వారిలో చిరంజీవి, మోహన్ బాబు, శ్రీహరి, శ్రీకాంత్ వంటి పలువురిని చెప్పుకోవచ్చు. గోపీచంద్ సైతం తొలిచిత్రంతో హీరోగా ఫ్లాప్ అయి విలన్ పాత్రలతో వచ్చిన గుర్తింపు తర్వాతే మళ్లీ హీరోగా స్థిరపడ్డారు. ఇప్పుడు ప్రతినాయకుడు అజయ్ సైతం హీరోగా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. సుమారు 25 చిత్రాల్లో నటించిన అజయ్ 'సింహాద్రి', 'విక్రమార్కుడు', 'లక్ష్మీకల్యాణం' చిత్రాలతో విలన్ గా మంచిపేరు తెచ్చుకున్నారు. తొలిసారి ఆయన 'ఆ ఒక్కడు' చిత్రంలో కథానాయకుడిగా నటిస్తూ ఈనెలలోనే ప్రేక్షకుల తీర్పు కోరబోతున్నారు. విలన్ పాత్రల్లో చేసి హీరోగా పరకాయప్రవేశం చేయడం అంత ఈజీ కాదనీ, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఉత్సుకత తనలోనూ ఉందని అజయ్ చెబుతున్నారు. ప్రతినాయకుడుగా నటించడం కంటే మంచివాడిగా కనిపించడం కోసం పడే శ్రమే ఎక్కువని ఆయన అభిప్రాయపడుతున్నారు. తొలి చిత్రం విడుదల కాకుండానే మరో నాలుగైదు ఆఫర్లు అజయ్ చేతిలో ఉన్నాయి. తాజాగా అజయ్ బాటలోనే మరో విలన్ సుబ్బరాజును హీరోగా పరిచయం చేసేందుకు పలువురు నిర్మాతలు సిద్ధపడుతున్నారు.
ఆరడుగల అందగాడైన సుబ్బరాజు తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఇప్పటికే ప్రతినాయకుడి పాత్రల్లో రాణిస్తున్నారు. హీరో కావాలనుకుని ప్రతినాయకుడిగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న సుబ్బరాజు ఇటీవల 'నేనింతే' చిత్రంలో స్టార్ హీరోగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. 'బిల్లా'లో ప్రభాస్ అనుచరునిగా చిన్న పాత్ర అయినా చక్కగా చేసి పలువురు నిర్మాతల దృష్టిలో పడ్డారు. హీరో కావడమంటే సినిమా మొత్తం భుజస్కంథాలపైనే వేసుకోవాల్సి ఉంటుందనీ, అందువల్ల ఆచితూచి మాత్రమే అడుగులు వేయదలచుకున్నాననీ సుబ్బరాజు చెబుతున్నారు. ప్రస్తుతం పలు స్క్రిప్టులు ఆయన పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ఓ కన్నడ రీమేక్ చిత్రానికి ఆయన త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. అజయ్ సక్సెస్ అయితే సుబ్బరాజు లైన్ కూడా క్లియర్ అయినట్టే.
Be first to comment on this News / Article!
|