నాగచైతన్యతో శృతిహాసన్?
నాగార్జున తనయుడు నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 'జోష్' (వర్కింగ్ టైటిల్)లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ వచ్చి చేరినట్టు టాలీవుడ్ వర్గాల తాజా భోగట్టా. ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగచైతన్య కు జోడిగా నిన్నటి తరం కథానాయిక రాధ కుమార్తె కార్తిక పరిచయమవుతోంది. సెకెండ్ హీరోయిన్ గా శ్రుతిని ఎంపిక చేశారనీ, ఇటీవలే హైద్రాబాద్ లో ఫోటో సెషన్ కూడా జరిపారనీ సమాచారం.
శ్రుతి ఇప్పటికే తమిళంలో గాయనిగా మంచిపేరు తెచ్చుకున్నారు. కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తూ రాజ్ కమల్ బ్యానర్ పై నిరిస్తున్న 'ఈనాడు' చిత్రం ద్వారా శ్రుతి సంగీత దర్శకురాలిగా కూడా పరిచయం కానున్నారు. దీనికితోడు శ్రుతి తొలిసారి హిందీలో నటించిన 'లక్' చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సోహమ్ షా, ఇమ్రాన్ ఖాన్ ల సరసన శ్రుతి నటించింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు బ్యానర్ ద్వారా శ్రుతిని పరిచయం చేసేందుకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'జోష్' చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఈనెల 21 నుంచి అమృత్ సర్ లో నెలరోజుల షూటింగ్ షెడ్యూల్ కు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున-రాధ స్పెషల్ అప్పియరన్స్ ఇవ్వబోతున్నారనీ, అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లోనూ, టబూ ఓ కీలక పాత్రలోనూ కనిపించనుందనీ ప్రచారం జరుగుతోంది. జూలైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|