నాగార్జున తనయుడు నాగచైతన్యను కథానాయకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న 'జోష్' చిత్రం విడుదలకు ముందే ఆయన తదుపరి చిత్రానికి కూడా పక్కా ప్లానింగ్ జరుగుతోంది. నాగార్జున స్యయంగా తన తనయుడి కెరీర్ ను ప్లానింగ్ చేస్తున్నారు. సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కాకుండా నాగచైతన్య తొలిచిత్రాన్ని బయట బ్యానర్ కు అప్పగించిన నాగార్జున ఈసారి కూడా బయట బ్యానర్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీనికి ఎస్.ఎస్.రాజమౌళిని దర్శకుడిగా ఎంపిక చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంతవరకూ ఫెయిల్యూర్స్ ఎరుగుని దర్శకుడిగా రాజమౌళికి పేరుంది. తాజాగా ఆయన రామచరణ్ తేజ కథానాయకుడిగా నటిస్తున్న 'మగధీర' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
నాగచైతన్య రెండో చిత్రానికి దర్శకుడిగా రాజమౌళి పేరు పరిశీలన వెనుక ఓ బలమైన సెంటిమెంట్ కూడా ఉందని తెలుస్తోంది. హీరోల రెండో చిత్రానికి రాజమౌళి పనిచేస్తే ఆ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందనే ప్రచారం ఒకటి ఉంది. ఎన్టీఆర్ రెండో చిత్రమైన 'స్టూడెంట్ నెంబర్ 1' చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. 'చిరుత' తర్వాత రామ్ చరణ్ రెండో చిత్రం కూడా ఇప్పుడు రాజమౌళి చేతిలో ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకునే నాగచైతన్య రెండో చిత్రానికి రాజమౌళిని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున సొంత బ్యానర్ లాంటి కామాక్షి మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించే అవకాశాలున్నాయి. నాగార్జున సైతం ఇదే బ్యానర్ లో తన తదుపరి చిత్రానికి కమిట్ అయ్యారు.