'గోపి గోపిక గోదావరి' 28న
గోదావరి అందాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన వంశీ ఈసారి టైటిల్ లో గోదావరిని చేర్చి సమ్మర్ ఎండల్లో ప్రేక్షకులను సేదతీర్చనున్నారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'గోపి గోపిక గోదావరి' చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ సమర్పణలో మహర్షి సినిమా పతాకంపై వల్లూరి పల్లి రమేష్ నిర్మించారు. వేణు, కమలిని ముఖర్జీ జంటగా నటించారు. ఈనెల 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు వల్లూరి పల్లి రమేష్ తెలిపారు.
వంశీ సినిమాలంటే గోదావరి ఎంతో సొగసుగా చిత్రీకరిస్తారనే విషయం అందరికీ తెలిసిందనేననీ, ఈ సినిమాలో గోపి, గోపికలతో పాటు గోదావరి నది కూడా ఓ పాత్రేనని ఆయన అన్నారు. గోదావరి సొగసులను ఎంతో అందంగా దర్శకుడు తెరకెక్కించారనీ, పోలవరం, పాపికొండలు, సింగనపల్లి రేవు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామనీ, సింగనపల్లి రేవులో వేసిన భారీ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ చెప్పారు. చక్రి సంగీతం అందించిన పాటలకు మంచి స్పందన వస్తోందనీ, వీటికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా చక్కగా కుదిరిందనీ తెలిపారు. వంశీ దర్శకత్వంలో గతంలో ఇదే బ్యానర్ నుంచి వచ్చిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' కంటే ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం తమకుందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కృష్ణ భగవాన్, కొండవలస, జీవా, కల్యాణ్, జయలలిత, గీతాంజలి, సన, పిల్లా ప్రసాద్ తదితరులు నటించారు. పడాల శివసుబ్రమణ్యం మాటలు, బి.లోకేశ్వరరావు సినిమాటోగ్రఫీ, బసవ పైడిరెడ్డి ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|