'జోష్'లో స్నేహ ఉల్లాల్?
నాగార్జున తనయుడు నాగచైతన్యను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 'జోష్' చిత్రం ప్రచారార్భాటాలకు దూరంగా శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను దిల్ రాజు గుట్టుగా ఉంచుతున్నప్పటికీ రోజుకో కొత్త విషయం బయటకు వస్తూ ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ ను పెంచుతోంది. నాగచైతన్య సరసన సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక హీరోయిన్ గా నటిస్తూ తొలిసారి తెలుగుతెరకు పరిచయమవుతుండగా, ఇందులోని మరో హీరోయిన్ పాత్రలో నీలికళ్ల సుందరి స్నేహ ఉల్లాల్ నటిస్తోందని విశ్వసనీయ సినీ వర్గాల తాజా భోగట్టా. తొలుత కమల్ హాసన్ కుమార్తె శ్రుతి ఇందులో నటించనుందంటూ ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు స్నేహ ఉల్లాల్ వచ్చి చేరినట్టు తెలుస్తోంది. లీడ్ హీరోయిన్ గానే స్నేహ ఉల్లాల్ పాత్ర ఉండబోతోందట.
ఐశ్వర్యారాయ్ పోలికల్లో కనిపించే స్నేహ ఉల్లాల్ 'నేను మీకు తెలుసా' చిత్రంతో యువ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం నాగార్జున మేనల్లుడు సుశాంత్ కు జోడిగా 'కరెంట్' చిత్రంలో నటిస్తోంది. ఇంతకుముందే నాగార్జున 'కింగ్' లోనూ ఓ స్పెషల్ సాంగ్ లో ఆయనతో నర్తించింది. ఇప్పుడు ఇదే ఫ్యామిలీకి చెందిన మరో తరం హీరో నాగచైతన్యతోనూ జతకట్టడంతో దాదాపు అక్కినేని ఫ్యామిలీ హీరోలందరితోనూ నటించిన క్రెడిట్ ఆమె సొంతం కానుంది. దిల్ రాజు సైతం 'జోష్' చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మాణపరంగా, స్టార్ కాస్ట్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున-రాధ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతుండగా, అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లోనూ, టబూ ఓ కీలక పాత్రలోనూ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 21 నుంచి అమృత్ సర్ లో నెలరోజుల భారీ షెడ్యూల్ జరుగనుంది. జూలైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Be first to comment on this News / Article!
|