'డార్లింగ్' కాజల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బిల్లా' చిత్రం తర్వాత స్పీడ్ పెంచారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏక్ నిరంజన్' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు తన తదుపరి చిత్రానికి కూడా ఆయన సన్నద్ధమవుతున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా 'ఛత్రపతి' వంటి సెన్సేషన్ హిట్ చిత్రాన్ని అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ కొత్త చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. దీనికి 'డార్లింగ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' వంటి హిట్ చిత్రాలను అందించిన కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా కాజల్ ను ఎంపిక చేసినట్టు తెలిసింది.
'లక్ష్మీకల్యాణం' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన కాజల్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా కృష్ణవంశీ 'చందమామ' తో సరైన బ్రేక్ ను అందుకుంది. ప్రస్తుతం రెండు ప్రిస్టేజియస్ చిత్రాలు కాజల్ చేతిలో ఉన్నాయి. రామ్ చరణ్ సరసన 'మగధీర' చిత్రంలోనూ, అల్లు అర్జున్ తో 'ఆర్య-2' (ఆక్రందన) చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది. ఈ రెండు చిత్రాల తర్వాత కాజల్ నెంబర్ వన్ రేసులో యువతరం హీరోయిన్లకు గట్టిపోటీ ఇవ్వనుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే 'మగధీర' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా ఉన్న బివిఎస్ఎన్ ప్రసాద్ 'డార్లింగ్' హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సాఫ్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ,
'తొలిప్రేమ' తర్వాత తనకెంతో నచ్చిన స్క్రిప్టు ఇదనీ కరుణాకరన్ చెబుతున్నారు. అతి త్వరలోనే 'డార్లింగ్ ' చిత్రం సెట్స్ పైకి రానుంది.
Be first to comment on this News / Article!
|