'కావ్యాస్ డైరీ' జూన్ 5న
కేవలం రెండే పాత్రలతో రూపొందించిన 'షో' చిత్రం నిర్మాతగా, నటిగా మహేష్ సోదరి మంజులకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత మంజుల నిర్మాతగా కొనసాగుతూ వచ్చారు. మహేష్ తో ఇటీవల ఆమె నిర్మించిన 'పోకిరి' చిత్రం 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర రికార్డులను తిరగరాసింది. మళ్లీ ఇంతకాలం తర్వాత మంజుల నటిగా 'కావ్యాస్ డైరీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మంజుల, ఛార్మి ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రాన్ని ఇందిరా క్రియేషన్స్ బ్యానర్ పై మంజుల భర్త సంజయ్ స్వరూప్ నిర్మించారు. కరుణ ప్రకాష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న్టటు నిర్మాత తెలిపారు.
నవ్యమైన కథ, కథనాలతో ప్రతీ ఒక్కరినీ అలరించే రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందిందని ఆయన చెప్పారు. కావ్య అనే అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, వాటి పర్యవసనాలను దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారని తెలిపారు. డైరీ చుట్టూ అల్లుకున్న పలు సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుందనీ, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం చక్కటి థ్రిల్ కలిగిస్తుందని దర్శకుడు సంజయ్ స్వరూప్ తెలిపారు. ఈ చిత్రంలో శశాంక్ కథానాయకుడు కాగా, ఇంద్రజిత్ మరో కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ మాటలు, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ, మను రమేషన్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|