నాగ్ సినిమా టైటిల్ '23'?
'కింగ్' శతదినోత్సవం పూర్తయి చాలారోజులే అయినప్పటికీ నాగార్జున తగినంత లీజర్ తర్వాతే మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవాలనుకుంటున్నారు. దీంతో నాగార్జున తదుపరి చిత్రం ఏమై ఉంటుందనే ఉత్సుకత ప్రేక్షకాభిమానుల్లో అంతకంతకూ ఎక్కువవుతోంది. ఇదే సమయంలో నాగార్జున మేనల్లుళ్లయిన శశాంక్ 'కరెంట్'తోనూ, సుమంత్ 'బోణి' తోనూ జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం, జూలై టార్గెట్ గా నాగార్జున తనయుడితో దిల్ రాజు నిర్మించిన 'జోష్' చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకోవడం అక్కినేని ఫ్యామిలీ అభిమానులను ఉత్సాహపరుస్తోంది. పనిలో పనిగా నాగార్జున తదుపరి చిత్రానికి '23' అనే వెరైటీ టైటిల్ ను అనుకుంటున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. నాగార్జున గతంలోనూ 'శివమణి 98480 22338' అనే వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
'కింగ్' తర్వాత మళ్లీ అదే చిత్ర నిర్మాణ సంస్థ అయన కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్న చిత్రానికి నాగార్జున కమిట్ అయ్యారు. ఈ చిత్రానికే '23' అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ రెడీ అవుతోంది. దర్శకుడెవరనేది ఇంతవరకూ ఖరారు కానప్పటికీ తరచు కొత్త దర్శకులను ప్రోత్సహించడానికి ఇష్టపడే నాగార్జున మరో కొత్త దర్శకుడికి ఈ చిత్రం ద్వారా అవకాశం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు ప్రముఖ దర్శకనిర్మాత గుణ్ణం గంగరాజు సైతం నాగార్జునకు సరిపోయే ఓ సబ్జెక్ట్ ను ప్రిపేర్ చేస్తున్నారు. ఇది బాలీవుడ్ లో విజయఢంకా మోగించిన షారూక్ 'ఛక్ దే ఇండియా' స్ఫూర్తితో ఉండబోతోందనీ చెబుతున్నారు. ఈ రెండింటిలో డి.శివప్రసాద్ రెడ్డి సినిమా ముందుగా సెట్స్ పైకి వస్తోందనీ, జూన్ లో ఈ కొత్త చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|