'శంఖం' పూరిస్తున్న గోపీచంద్
సినీ ఫీల్డ్ లో సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందులోనూ హిట్ సెంటిమెంట్ అయితే అది మళ్లీ మళ్లీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హీరో గోపీచంద్ సినిమా టైటిల్స్ కు చివర్లో సున్నా ఉంటే ఆ సినిమా హిట్ ఖాయమనే సెంటిమెంట్ ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంది. ఆయన తొలిసారి హీరోగా నటించిన 'తొలి వలపు' చిత్రం ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత విలనీ పాత్రల వైపు మళ్లారు. అలా ఆయన నటించిన 'జయం', 'వర్షం' చిత్రాలు మంచి సక్సెస్ సాధించడంతో టైటిల్ చివర్లో సున్నా సెంటిమెంట్ ఆయనకు కలిసి వచ్చినట్టయింది. ఈ రెండు చిత్రాల తర్వాత గోపీచంద్ మళ్లీ కథానాయకుడిగా పలు హిట్లు సాధించారు. వీటిలోనూ సున్నా సెంటిమెంట్ ఉంది. 'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం', 'శౌర్యం' చిత్రాలు ఈ కోవలోనివే. అందుకు భిన్నంగా వచ్చిన 'ఆంధ్రుడు', 'ఒక్కడున్నాడు' బోల్తా పడ్డాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే గోపీచంద్ కథానాయకుడుగా శివ దర్శకత్వంలో ప్రస్తుతం నిర్మాణం జరుపుకొంటున్న తాజా చిత్రానికి 'శంఖం' అనే టైటిల్ ను సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
గోపీచంద్-శివ కాంబబినేషన్ లో ఇటీవల 'శౌర్యం' వంటి హిట్ చిత్రం రూపొందింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె.భగవాన్, జి.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. గోపీచంద్ కు జోడిగా త్రిష నటిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాలోని అందమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరిపారు. ఈనెలాఖరుకు షూటింగ్ పూర్తి చేయాలనే పట్టుదలతో దర్శకనిర్మాతలు ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ కు తండ్రిగా తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో చంద్రమోహన్, ధర్మవరపు, ఆలి, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, ఎల్.బి.శ్రీరామ్, ఆహుతి ప్రసాద్, బెనర్జీ, సీత తదితరులు నటిస్తున్నారు. బెట్టీ సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|