యండమూరి డైరీ
ప్రముఖ నవలా రచయితగా యండమూరి వీరేంద్ర నాథ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. కొద్దికాలం వరకూ నవలా సాహిత్యాన్ని ఓ ఊపుఊపిన ఆయన ఇటీవల విద్యా విషయిక పుస్తకాల రచనతోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 80వ దశకంలో చిరంజీవి, కోదందరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన పలు హిట్ చిత్రాలు ఆయన రాసిన నవలల ఆధారంగా వచ్చినవే. అప్పట్లో చిరంజీవి నటించిన 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్' సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. ఇటీవల కోదండరామిరెడ్డి తీసిన 'పున్నమినాగు' చిత్రానికి ఆయన కథ అందించారు. తాజాగా ఆయన నటుడిగా కూడా మారారు. శివాజీ, శ్రద్ధాస్ కాంబినేషన్ లో రామకృష్ణ మచ్చకంటి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న 'డైరీ' చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. గ్రేట్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి జన్ నెక్స్ట్ పతాకంపై కల్యాణ్ రామ్ చుక్కా, మేఘశ్యామ్ బోకం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని దర్శకుడు రామకృష్ణ తెలియజేస్తూ, ఓ డైరీలో రాసిన అంశంతో ఈ చిత్ర కథ ఉత్కంఠ భరితంగా ఉంటుందనీ, ఇంతకూ ఆ డైరీలో ఏముంది? ఎవరు రాసారనేది ఆసక్తికరంగా ఉంటుందనీ అన్నారు. నవలా రచయితగా సుస్థిర స్థానం సంపాందిచుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఈ కథ ఎంతగానో నచ్చి ఈ సినిమాలో తొలిసారిగా నటించడానికి ఒప్పుకున్నారనీ, దీనిని బట్టే కథ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చునీ అన్నారు. సస్సెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉంటుందన్నారు. యండమూరి పాత్ర ఈ కథకు కీలకమనీ, అడగ్గానే ఆయన నటించేందుకు అంగీకరించడం చాలా ఆనందంగా ఉందనీ నిర్మాతలు తెలిపారు. ఈనెల 29న 'డైరీ' విడుదల కానుంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో డాక్టర్ శివప్రసాద్, జీవా, హర్షవర్దన్, శ్రీనివాస్, కమల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అరూన్ కథ, గౌతంరాజు ఎడిటింగ్, వి.శ్రీనివాసరెడడి సినిమాటోగ్రఫీ, మంత్ర ఆనంద్ సంగీతం, సోమా విజయప్రకాష్ నిర్మాణ సారథ్యం వహించారు.
Be first to comment on this News / Article!
|