'నా స్టైలే వేరు' 5న
'సత్యమేవ జయతే' చిత్రంతో ఎదురుదెబ్బ చవిచూసిన రాజశేఖర్ ఇప్పుడు 'నా స్టైలే వేరు' అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రాజశేఖర్ సరసన అందాల నటి భూమిక నటించిన ఈ చిత్రాన్ని దిసిర ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి గోపీనాథ్ నిర్మించారు. జి.రామ్ ప్రసాద్ దర్శకుడు. జూన్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
రాజశేఖర్ ఇంతవరకూ నటించని పాత్ర ఇదనీ, ఇందులో ఆయన క్రిమినల్ లాయర్ శివరామ్ గా చక్కటి నటన ప్రదర్శించారని దర్శకుడు రామ్ ప్రసాద్ తెలిపారు. పాత్రకు తగ్గట్టుగానే రాజశేఖర్ మాట, ప్రవర్తన, ఆలోచన అందరికంటే భిన్నంగా ఉంటాయనీ, అదే తన స్టైల్ అని చెబుతుంటారనీ, చక్కటి వినోదం పంచుతూనే చిన్నపాటి ఉత్కంఠ కలిగించేలా కథ ఉంటుందని ఆయన వివరించారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఆడియోకి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఇందులో రాజశేఖర్ క్లయింట్ గా భూమిక నటించింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, విజయ్ కుమార్, దేవరాజ్, చలపతిరావు, గిరిబాబు, ఆహుతి ప్రసాద్, జీవా, బెనర్జీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి భాస్కర భట్ల, విజయ్ కుమార్ పాటలు, కోన వెంకట్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు.
Be first to comment on this News / Article!
|