ఆర్తికి పోసాని గాలం?
పోసాని కృష్ణమురళి ఎప్పుడూ ఏదోరకంగా వార్తల్లో ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఎదుట వారు ఏమనుకుంటారో అనేది కాకుండా తనకు తోచినట్టు మాట్లాడటం, తనకు నచ్చినట్టుగానే సినిమాలు తీయడం ఆయన స్పెషాలిటీ. రచయిత కావడంతో బుర్రనిండా పొలిటికల్ ఆలోచనలే. అదే ఊపులో తీసిన 'ఆపరేషన్ దుర్యోధన' హిట్ కావడంతో ఇక పొలిటికల్ పిక్చర్స్ తీయడంలో తనకు ఎదురులేదని అనిపించుకున్న పోసాని 'రాజావారి చేపల చెరువు' అంటూ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తాపీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చల్లబడిపోయారు. ఇందులో హీరోయిన్ పై తీసిన ఓ 'నగ్న' సన్నివేశం ('ప్రతిఘటన' తరహాలో) థియేటర్లలో కూర్చున్న మహిళా ప్రేక్షకులను ముఖం తిప్పుకునేలా చేసిందంటూ విమర్శలు వచ్చాయి. అంతకుముందు 'మెంటల్ కృష్ణ'లో నైటీలు తొడుక్కుని, సొంత భార్యను అనుమానించే శాడిస్ట్ తరహా పాత్ర పోషించారు. ఆ చిత్రంలో పోసాని భార్యగా నటించిన సత్యకృష్ణకు అప్పటివరకూ చిన్నాచితకా పాత్రలు వచ్చినా ఆ తర్వాత పిలిచి వేషాలిచ్చే వాళ్లే కరువయ్యారు. ఏతావాతా పోసాని చిత్రాల్లో స్త్రీ పాత్రలు గతితప్పుతాయనే అపప్రద మూటకట్టుకోవాల్సి వచ్చింది. పోనీ పొలిటికల్ చిత్రాలు కంటిన్యూ చేద్దామా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై మళ్లీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడితే కొత్త చిక్కులను ఆహ్వానించినట్టే కావచ్చు. దీంతో పోసాని ఇప్పుడు రూటు మార్చి...ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారని ట్రేడ్ వర్గాల భోగట్టా.
స్త్రీల పాత్రలను తక్కవ చేసి చూపిస్తున్నారనే అపప్రద నుంచి బయటపడేందుకు పోసాని ఈసారి 'పవిత్ర బంధం' తరహా పూర్తి ఫ్యామిలీ సబ్జెక్ట్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ఆర్తి అగర్వాల్ నటించబోతోందని కూడా వినిపిస్తోంది. హీరోయిన్ గా తొలి ఇన్నింగ్స్ లో ఓ వెలుగు వెలిగిన ఆర్తి మళ్లీ ఇప్పుడు అమెరికా నుంచి తిరిగొచ్చి కొత్త సినిమాల కోసం పలువురు దర్శకనిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే పోసాని నుంచి ఆమెకు ఆఫర్ వచ్చిందని అంటున్నారు. మరి ఆర్తి ఈ ఆఫర్ ను ఒప్పుకుంటుందా? సౌందర్య తరహాలో ఆమె పాత్రను పోసాని మలుస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
Be first to comment on this News / Article!
|