మమతకు దక్కిన 'వరుడు'
హస్కీ వాయిస్ తో గాయనిగా, రేవిషింగ్ లుక్స్ తో హీరోయిన్ గా యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మమతా మోహన్ దాస్ కు ఎందుకనో సోలో హీరోయిన్ అవకాశాలు అంతగా రావడం లేదనే చెప్పాలి. ఆమె నటించగా హిట్టయిన 'యమదొంగ', 'చింతకాయల రవి' చిత్రాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఈమధ్యన హిట్టయిన 'కింగ్'లోనూ అంతే. ఈ చిత్రం తర్వాత మమత ఇంకా ఓ కొత్త చిత్రానికి కమిట్ కానప్పటికీ తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడుగా నటిస్తున్న 'వరుడు' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల తాజా ముచ్చట. ఈ చిత్రంలో అనుష్క ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'వరుడు' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసం తొలుత తమన్నాను సంప్రదించగా ఆమె నిరాకరించింది. ఆ తర్వాత ప్రియమణి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే తనను ఎవరూ ఆ సినిమా కోసం సంప్రదించలేదని చెబుతూనే సెకెండ్ హీరోయిన్ పాత్రలు చేసేది లేదంటూ ఆమె తెగేసి చెప్పింది. ఈ క్రమంలో 'వరుడు' తో జత కట్టేందుకు మమత అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ సింగపూర్, మలేసియాలో జరగబోతోంది. ఈ షెడ్యూల్ లో మమత పాల్గొని ఓ పాటలో మహేష్ తో కలిసి నర్తించనుందని తెలుస్తోంది. గత ఏడాది మహేష్ నటించిన చిత్రమేదీ విడుదల కానందున ఈ ఏడాది చివర్లోనే 'వరుడు' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావచ్చు.
Be first to comment on this News / Article!
|