ఆకర్షణలో పడను: యండమూరి
'డైరీ' చిత్రంలో రచయితగా తాను పోషించిన పాత్ర బాగుందని అంతా అంటున్నారని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. ప్రస్తుతం 'విలేజ్ లో వినాయకుడు' అనే సినిమాకు ఒప్పుకున్నాననీ, ఆ తర్వాత తన మటుకు తాను నటనను కొనసాగించాలని అనుకోవడం లేదనీ చెప్పారు. హైద్రాబాద్ లోని కునాల్ గెస్ట్ హౌస్ లో ఈ విశేషాలను ఆయన మంగళవారంనాడు తెలియజేశారు.
'డైరీ' చిత్రంలో నటించడానికి దారితీసిన పరిస్థితులు వివరిస్తూ, ఆ చిత్ర నిర్మాతలు తన వద్దకు ఆ కథ తీసుకు వచ్చి కథ మొత్తం ఓ రచయిత పాత్ర మీదే ఆధారపడి ఉంటుందనీ, ఆ పాత్రకు తానయితేనే బాగుంటుందని అడిగారనీ, ఆ పాత్ర నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాననీ చెప్పారు. ఇటీవల విడుదలైన ఆ సినిమాను తాను ఇంకా చూడలేదనీ, అయితే చూసినవారంతా సినిమాతో పాటు తన పాత్ర కూడా బాగుందని అంటున్నారని చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పినట్టు తెలిపారు. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే 'వినాయకుడు' చిత్రానికి సీక్వెల్ గా ఆ చిత్ర నిర్మాతలు రూపొందించనున్న 'విలేజ్ లో వినాయకుడు' సినిమాలోని ఓ పాత్రను తనకు ఆఫర్ చేశారనీ, పాత్ర నచ్చడంతో ఒప్పుకున్నాననీ అన్నారు. ఇందులో ఓ లావుపాటి ఆవిడకు భర్తగా నటిస్తున్నాననీ, మంచి హాస్యం పండించే పాత్రనీ చెప్పారు. గతంలో ఎంతో మంది నటించమని అడిగినప్పటికీ రచయితగా బిజీగా ఉండటం వల్ల అంగీకరించలేదని తెలిపారు. 'విలేజ్ లో వినాయకుడు' తర్వాత నటించడం ఆపేద్దామని అనుకుంటున్నానని అన్నారు. సినిమా ఆకర్షణలో పడితే తాను నిర్వహిస్తున్న సరస్వతీ విద్యాపీఠం పనులకు ఆటంకం కలుగుతుదనే ఉద్దేశంతోనే నటనపై అంతగా ఆసక్తి చూపడం లేదన్నారు. ఒకవేళ నటుడిగా కొనసాగాలని చిత్రపరిశ్రమ కోరుకుంటే ఆలోచిస్తానని అన్నారు.
Read 4 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2-
|