ప్రజాసేవంటే ఇష్టం: జయసుధ
ప్రజాసేవ అంటే తనకు ప్యాషన్ అనీ, రాజకీయాల్లోకి రావాలనుకోవడం, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడం రెండూ ఒకేసారి జరిగాయని ప్రముఖ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి జయసుధ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ సినిమా రంగానికి దూరం కానని స్పష్టం చేశారు. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మంగళవారం సాయంత్రం హైద్రాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆమెను సత్కరించింది.
జయసుధ మాట్లాడుతూ, గత ఉప ఎన్నికల్లోనే తనను పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినప్పటికీ అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాననీ, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో ట్రస్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపట్టాననీ చెప్పారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు నచ్చి రాజకీయాల్లోకి రావాలనే బలమైన కోరిక కలగడం, తనపై విశ్వాసం ఉంచి ప్రజలు గెలిపించడం సంతోషంగా ఉందనీ అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో చోటు గురించి కూడా ప్రచారం జరిగినా తాను నమ్మలేదనీ, ప్రజా సేవ చేయాలన్నదే తన తపనని వివరించారు. నటిగా తనకు ఇటీవల కాలంలో అన్నీ అతిథి పాత్రలో వస్తున్నాయనీ, అందరూ తెలిసిన వాళ్లే కావడంలో వాటిని ఒప్పుకోక తప్పడం లేదన్నారు. సమాజానికి ఉపయోగపడే మంచి పాత్రలయితే తప్పనిసరిగా చేస్తానని అన్నారు. అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెడుతున్నందన మీ ఫీలింగ్ ఏమిటనే ప్రశ్నకు తాను ఎప్పుడూ ఒకేలా ఉంటాననీ, ఒక్క క్రికెట్ మ్యాచ్ సందర్భాల్లో తప్ప ఇంకెప్పుడూ థ్రిల్ కు గురికాలేదనీ నవ్వుతూ చమత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోయేషన్ అధ్యక్షుడు ప్రభు, కార్యదర్శి బి.జయ, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు, ఎం.డి.అబ్దుల్, సునీతా చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|