రాజశ్రీ బ్యానర్ లో తమన్నా
సిమ్లా యాపిల్ ను తలపించే తమన్నాకు తెలుగులో 'హ్యాపీడేస్' చిత్రం మంచి బ్రేక్ ఇవ్వడంతో తమిళంలోనూ అవకాశాలు అందిపుచ్చుకుని తాజాగా రెండు భాషల్లోనూ మంచి డిమాండ్ ను కొనసాగిస్తోంది. తమిళంలో 'కల్లూరి' చిత్రం ఆమెకు నటిగా మంచి పేరు తెస్తే, ఇటీవల విడుదలైన 'అయన్' (వీడొక్కడే) చిత్రం కమర్షియల్ హీరోయిన్ గా ఆమెను తమిళంలో మరింత బిజీ చేసింది. ఇదే సమయంలో సిద్దార్ధకు జోడిగా ఆమె తెలుగులో నటించిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రం కూడా కమర్షియల్ సక్సెస్ అయింది. నల్లమలుపు బుబ్జి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోంది.
రాజశ్రీ పిక్చర్స్ సంస్థ హిందీలో 'హమ్ ఆప్కే హై కౌన్', 'హమ్ సాథ్ సాథ్ హై', 'వివాహ్' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించింది. ఆ బ్యానర్ లో నటించడం ప్రిస్టేజియస్ గా నటీనటులు భావిస్తుంటారు. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాన్ని ఇప్పుడు హిందీలోకి ఆ సంస్థ రీమేక్ చేయనుండగా, నల్లమలుపు బుజ్జి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. తెలుగు మాతృకలో నటించిన తమన్నా ఈ చిత్రంలోనూ హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. తమన్నా 15 ఏళ్ల ప్రాయంలోనే హిందీలో 'చాంద్ సే రోషన్ చెహ్రా' చిత్రంలో నటించింది. ఇప్పుడు దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని మళ్లీ బాలీవుడ్ గడప తొక్కనుంది. ఇప్పుడిప్పుడే హిందీలో డిమాండ్ తెచ్చుకుంటున్న ఆసిన్, జెనీలియా బాటలోనే తమన్నా కూడా బాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|