బాలయ్యతో బెల్లంకొండ చిత్రం
యువరత్న బాలకృష్ణ అంటే నిర్మాత బెల్లంకొండ సురేష్ కు ప్రత్యేకాభిమానం ఉంది. బెల్లంకొండ చిత్రంలో తొలిసారి నటించిన స్టార్ హీరో బాలకృష్ణ కావడమే ఇందుకు కారణం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'లక్ష్మీ నరసింహా' చిత్రం రావడంతో బెల్లంకొండ సురేష్ అగ్ర నిర్మాతల జాబితాలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా 'కాల్పుల' ఉదంతం చోటు చేసుకోవడంతో ఈ ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ తొలగి ఇద్దరూ దగ్గరయ్యారు. బెల్లంకొండ తాజా చిత్రం 'రైడ్' ఆడియో వేడుకకు బాలకృష్ణ హాజరు కావడం, ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమా తీయడానికి రెడీగా ఉన్నానంటూ బెల్లంకొండ ప్రకటించడంతో ఆ దిశగా ఇప్పుడు
ఓ కొత్త చిత్రానికి ప్లానింగ్ జరుగుతోంది.
బాలకృష్ణతో మరోసారి బెల్లంకొండ నిర్మించతలబెట్టిన చిత్రానికి మెహర్ రమేష్ ను దర్శకుడిగా ఎన్నుకున్నట్టు సమాచారం. 'కంత్రి', 'బిల్లా' చిత్రాలతో స్టయిలిష్ డైరెక్టర్ గా మంచిపేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ ఇప్పుడు బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని ఓ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10న ఈ కొత్తచిత్రం లాంఛనంగా ప్రారంభం కావచ్చని చెబుతున్నారు. మరోవైపు 'కిక్' కథానాయకుడు రవితేజతో కృష్ణవంశీ దర్శకత్వంలో మరో చిత్రానికి కూడా బెల్లంకొండ సన్నాహాలు చేస్తున్నారు. అంతా సజావుగా జరిగితే బాలకృష్ణ, రవితేజ చిత్రాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకొనే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|