మారథాన్ 'మగధీర'
రామ్ చరణ్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర' చిత్రం విడుదల తేదీ దగ్గరవుతున్న కొద్దీ ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ నెలకొంటోంది. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే 35 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మూడు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి రాజమౌళి 220 పని దినాలు వెచ్చించారు. రాజస్థాన్ లో కీలక ఘట్టాల చిత్రీకరణ కూడా జరిపారు. రాజమౌళి ఏది కోరితే అది నిర్మాత ఇవ్వడంతో అత్యంత రిచ్ గా ఈ చిత్రం రూపొందినట్టు ట్రేడ్ సమచారం. ఆసక్తికరంగా ఈ చిత్రం నిడివి ఇప్పుడు దర్శకుడు రాజమౌళికీ, ఎడిటర్ కూ ఓ సవాల్ అవుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి ఫైనల్ అవుట్ పుట్ నాలుగు గంటల నిడివితో ఉందనీ, దానిని రెండున్నర గంటలకు ఎలా కుదించాలనే విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది.
రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారట. దీంతో ఏ సన్నివేశం కట్ చేయాలన్నా ఎడిటర్ పునరాలోచించాల్సి వస్తోందని తెలుస్తోంది. గంటన్నర పాటు ఎడిట్ అయ్యే వెర్షన్ ను దాచి ఉంచమని పలువురు సలహా ఇస్తున్నారట. ఇందువల్ల 'మగధీర' రిలీజైన కొద్ది నెలల తర్వాత సీక్వెల్ కు వీటిని ఉపయోగించుకునే వీలుంటుందనీ, అలాకాని పక్షంలో డివిడి రిలీజ్ సమయంలో ఒరిజినల్ నిడివిని జోడిస్తే ప్రత్యేక ఆకర్షణ అవుతుందని పలువురు సూచనలు చేస్తున్నారట. పునర్జన్మల కథాంశాలకు సీక్వెల్స్ ఇంతవరకూ రాలేదు కాబట్టి ఒకవేళ 'మగధీర' సీక్వెల్ కు వెళితే అది కూడా సంచనలమే అవుతుంది. ఎటొచ్చీ 'మగధీర' రేంజ్ ఏమిటనేది తేలాల్సి ఉంటుంది. జూలై 9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|