25న వంశీ 'గో గో గో'
గోదావరి అందాలను తెరకెక్కించడంలో దర్శకుడు వంశీకి ప్రత్యేకమైన స్టయిల్ ఉంది. ఈసారి ఆయన గోదావరిని కూడా ఓ పాత్రగా తీర్దిదిద్ది 'గోపి గోపిక గోదావరి' చిత్రాన్ని తెరకెక్కించారు. వేణు, కమలిని ముఖర్జీ హీరోహీరోయిన్లు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సమర్పణలో మహర్షి సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందింది. తొలికాపీ సిద్ధమైన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఈనెల 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వల్లూరి పల్లి రమేష్ తెలిపారు.
ప్రేమకథా చిత్రాలను రూపొందించడంలో వంశీది ఓ ప్రత్యేక మైన శైలి అనీ, ఆయన మార్క్ తో రూపొందిన చిత్రమిదని ఆయన వివరించారు. సహజంగా వంశీ చిత్రాల్లో గోదావరి అందాలు ప్రేక్షకులను కనువిందు చేస్తాయనీ, ఈ చిత్రంలో కూడా గోదావరి అందాలు మరింత ప్రస్ఫుటమవుతాయని చెప్పారు. పోలవరం, గోదావరి, పాపికొండలు, సింగన్నపల్లి రేవు వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని చెప్పారు. ఇందులోని ఐదు పాటల్లో ఒక పాట సింగన్నపల్లి రేవులో వేసిన భారీ సెట్ లో చిత్రీకరించామన్నారు. ఇక్కడే తీసిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కృష్ణ భగవాన్, కొండవలస, జీవా, కల్యాణ్, జయలలిత, గీతాంజలి, సన, పిళ్లా ప్రసాద్ తదితరులు నటించారు. రామజోగయ్య శాస్త్రి పాటలు, బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్, బి.లోకేశ్వరరావు సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|