'ఇంద్ర' బాటలో 'మగధీర'
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ కు స్వస్తి చెప్పడం, రామ్ చరణ్ ను తన నటవారసుడిగా 'చిరుత'తో పరిచయం చేయడంతో మెగాభిమానులంతా ఇప్పడు చిరంజీవిని ఆయన తనయుడిలో చూసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో రామ్ చరణ్ రెండో చిత్రమైన 'మగధీర'పై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకాభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకునే సినిమా సక్సెస్ కు ఉపకరించే ఏ చిన్న అవకాశాన్నికూడా విడిచిపెట్టకుండా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత అల్లు అరవింద్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మెగా ఫ్యామిలీ, అభిమానుల సమక్షంలో ఈనెల 28న శిల్పకళా వేదికపై ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. మెగాభిమానులకు మరో శుభవార్త కూడా ఉంది. జూలై 24న 'మగధీర' రిలీజ్ కు ప్లానింగ్ జరుగుతోంది. ఈ తేదీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే తేదీన చిరంజీవి 'ఇంద్ర' చిత్రం విడుదలైంది.
బి.గోపాల్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన 'ఇంద్ర' చిత్రం చిరంజీవి కెరీర్ లోనే మంచి హిట్ గా పేరు తెచ్చుకుంది. ఆసక్తికరంగా 'మగధీర'లో రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి ఓ పాటలో స్టెప్స్ వేశారు. తండ్రీ కొడుకులిద్దర్నీ ఒకే సినిమాలో చూపించడంతో పాటు 'ఇంద్ర' రిలీజ్ రోజునే 'మగధీర' విడుదల చేయడం ద్వారా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుందనే అభిప్రాయంతో రాజమౌళి ప్రభృతులు ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా కాజల్, ప్రత్యేక పాత్రలో శ్రీహరి నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|