'రాజు మహరాజు' రివ్యూ
అయితే థ్రిల్లర్...లేకుండే లవ్ స్టోరీ అనే చందంగా ఉంది ఇవాల్టి సినిమా పరిస్థితి. మొదటి తరహా సినిమాలకు కాస్త విజువల్ నాలెడ్జ్, రెండో తరహా సినిమాలకు పరిచయం లేని ముఖాలు ఉంటే చాలు. సకుటుంబ కథా చిత్రాల జోలికి వెళ్లే సాహసం దాదాపు ఎవరూ చేయని పరిస్థితి. దీంతో ఇవాల్టి సినిమా రాజపోషకులు పక్కా మాస్ ప్రేక్షకులు లేదా యూత్ ఆడియెన్స్ అవుతున్నారు. అలాంటి తరుణంలో ...మాది 100 శాతం కుటుంబ కథా చిత్రం అని బల్లగుద్ది మరీ చెప్పి 'రాజు మహరాజు' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇందుకు నిర్మాత కుమారస్వామి పత్తికొండను అభినందించవచ్చు. అయితే కుటుంబ కథా చిత్రాల విషయానికి వచ్చినప్పుడు టేకింగ్ లో పాత ఛాయలు లేకుండా చూసుకోవడం, ఇవాల్టి జనరేషన్ మెచ్చే విధంగా నేరేషన్ లో వేగం అనివార్యమవుతుంది. దర్శకుడు దుర్గా శంకర్ నాథ్ ఈ రెండు అంశాలపై మరింత శ్రద్ధ చూపి ఉండాల్సింది. 'ప్రేమ డబ్బుని తెస్తుంది..కానీ డబ్బు ప్రేమను తేలేదు' అనే పాయింట్ చుట్టూ రెండున్నర గంటల కథను అల్లుకున్నారాయన. అయితే కథలోని మలుపులను, క్యారెక్టర్ల మధ్య సంఘర్షణను ప్రేక్షకులు తేలిగ్గానే ఊహించగలుగుతారు. కథలు కొత్తగా పుట్టకపోవచ్చు...గతంలో చెప్పిందే అయినా కొత్తగా చెప్పగలిగినప్పుడే కదా దర్శకుడి సత్తా తేలుతుంది. సెంటిమెంట్, ప్రతీకారం డ్రామాతో అల్లుకున్న 'రాజు-మహరాజు' లోతుపాతుల్లోకి వెళితే...
కల్యాణ్ (శర్వానంద్) తనకంటూ ఓ లక్ష్యం లేని యువకుడు. అతని అన్న చక్రవర్తి (మోహన్ బాబు) బాగా డబ్బున్న బిజినెస్ మన్. అన్న, వదిన రమ్య (రమ్యకృష్ణ)కు అతనంటే పంచప్రాణాలు. డబ్బు మైకంలో తిరుగుబోతు, తాగుబోతుగా కల్యాణ్ వ్యవహరిస్తుంటాడు. ప్రేమ, మానవతా విలువలు గురించి ఏ మాత్రం పట్టింపులు లేని అతనికి స్నేహ (సుర్వీన్ చావ్లా) తారసపడుతుంది. సంఘసేవ, సాటిమనిషి పట్ల ప్రేమ చూపడం వంటి ఉన్నత లక్షణాలు స్నేహలో ఉంటాయి. కల్యాణ్ ఆమెను ప్రేమిస్తాడు. అయితే అతని ప్రవర్తన, క్యారెక్టర్ ఏమాత్రం ఇష్టపడని స్నేహ అతన్ని దూరంగా ఉంచుతుంది. దీంతో ఆమెను పరీక్షలో ఫెయిల్ చేయించడం వంటి విపరీత చర్యలకు పాల్పడుతుంటాడు. తన మరిదిలోని ప్రవర్తనను వదిన రమ్య గ్రహిస్తుంది. ప్రేమలో వైఫల్యాన్ని తట్టుకోలేకపోతున్నాడని భావించిన రమ్య నేరుగా స్నేహను కలుసుకుంటుంది. పది రోజుల పాటు కల్యాణ్ తో స్నేహంగా ఉండమనీ, ఆలోపే వేరే అమ్మాయితో కల్యాణ్ సెటిల్ అయ్యేలా చూస్తాననీ చెబుతుంది. ఇందుకు స్నేహ అంగీకరిస్తుంది. ఓరోజు కల్యాణ్ తన స్పీడ్ డ్రైవింగ్ తో స్నేహ ముందే ఓ యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి చావుకు కారణమవుతాడు. ఆ విషయాన్ని కల్యాణ్ ఏమాత్రం సీరియస్ గా పట్టించుకోకపోవడంతో స్నేహ అతనికి ఎదురుతిరుగుతుంది. కల్యాణ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మరెవరో కాదు...స్నేహ తండ్రే (నాజర్). అసలు కథ అక్కడ్నించే మొదలవుతుంది. స్నేహ ఎలాంటి ప్రతీకారానికి దిగింది? ఇందువల్ల కల్యాణ్ లో వచ్చిన మార్పేమిటి? అనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|