కింగ్ తో చిత్రాంగద సింగ్
'కింగ్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నాగార్జున ఇంతవరకూ మేకప్ వేసుకోనప్పటికీ ఆయన తదుపరి చిత్రం మళ్లీ కామాక్షి కళా మూవీస్ పతాకంపైనే ఉండబోతోంది. నాగార్జున సొంత సంస్థ లాంటి కామాక్షి పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి పలు హిట్ చిత్రాలను అందించారు. అదే సెంటిమెంట్ తో నాగార్జున తన తదుపరి చిత్రాన్ని కూడా ఇదే బ్యానర్ లో ప్రకటించారు. దీంతో కొద్దికాలంగా తగిన స్క్రిప్టు రచన, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. తొలుత ఈ చిత్రానికి బోయపాటి శ్రీను, పరశురామ్ వంటి దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ ఇప్పుడు ఆ పేర్లు పాతబడ్డాయి. కొత్త దర్శకులను పరిచయం చేయడానికి ఇష్టపడే నాగార్జున ఈసారి కూడా ఓ కొత్త దర్శకుడితో ఈ చిత్రానికి పనిచేయబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన నటించే అవకాశాన్ని చిత్రాంగదసింగ్ అందిపుచ్చుకుందని టాలీవుడ్ వర్గాల తాజా భోగట్టా.
చిత్రాంగధ సింగ్ ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం చూరగొంటోంది. తొలుత ఐసిఐసిఐ బ్యాంక్, అలుక్కాస్ జ్యూయెలరీ వంటి కమర్షియల్ యాడ్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ 'హజారోం క్వాహిషే ఐసి', 'ఎస్టర్ డే అండ్ టుమారో' వంటి చిత్రాల్లో నటించింది. కొద్ది బ్రేక్ అనంతరం ఇటీవల నటించిన 'సారీ భాయ్' చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చంది. స్క్రీన్ , జీ సినీ అవార్డు, అప్సరా అవార్డులను కూడా దక్కించుకుంది. స్మితాపాటిల్ పోలికలు ఉండటం కూడా ఆమెకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పలువురు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో తమ అదృష్టాన్నిపరీక్షించుకుంటున్న తరుణంలో నాగార్జున వంటి స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం ద్వారా చిత్రాంగద సింగ్ టాలీవుడ్ లో కి అడుగుపెడుతోంది. జూలై చివర్లో ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమై, డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే ఆలోచనలో నిర్మాత శివప్రసాద్ రెడ్డి ఉన్నారు.
Be first to comment on this News / Article!
|