షామిలికి ముసుగేశారు!
బేబి షామిలి ఇప్పుడు కుమారి షామిలి అయింది. మూడేళ్ల ప్రాయంలోనే మణిరత్నం 'అంజలి' చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటిగా అవార్డు గెలుచుకుని ఆ తర్వాత బాలనటిగా 40కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది షామిలి. ఆ తర్వాత కొద్ది కాలంగా నటనకు దూరంగా ఉన్న షాలిని ఇప్పుడు తొలిసారి హీరోయిన్ అయింది. రెండేళ్లుగా షాలిని హీరోయిన్ గా పరిచయమవుతోందంటూ వినిపించినా దర్శకుడు ఆనంద్ రంగా ఎంతో నేర్పుతో ఆమెను ఒప్పించి 'ఓయ్' చిత్రం ద్వారా ఆమెను తొలిసారి తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. యూనివర్శల్ మీడియా పతకాంపై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో సిద్దార్ధకు జోడిగా షామిలి నటిస్తోంది. ఈ సినిమాకి షామిలి ప్రధాన ఆకర్షణ అవుతుందని ఫిల్మ్ మేకర్స్ తో పాటు సిద్దార్ధ కూడా లెక్చర్లు దంచేస్తూ షామిలికి కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు కానీ అసలు బేబి షామిలి కుమారి షామిలిగా ఎంత క్యూట్ గా ఉందో తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్న వారికి మాత్రం ఆమె ఫేస్ ను రివీల్ చేయకుండా దాచిపెడుతున్నారు.
షూటింగ్ ఏ దశలోనే షామిలీ ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడిన దర్శక నిర్మాతలు మరో పదిరోజుల్లో సినిమా విడుదలకు దగ్గరవుతున్న తరుణంలో కూడా అదే సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. గత వారమే సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషన్ స్టిల్స్, వాల్ పేపర్లు మీడియాకు రిలీజ్ చేశారు. ఆసక్తికరంగా వీటిల్లో కూడా షామిలిని కనిపించీ కనిపించకుండా డిజైన్ చేశారు. ఈ ఉత్సుకతను సిద్దార్ధ మరింత పెంచుతూ, బాలనటిగా జాతీయ అవార్డు అందుకున్న షామిలితో పనిచేయడం తనకు మంచి అనుభూతినిచ్చిందనీ, సినిమా చూసిన తర్వాత ఇందులోని పాత్రకు షామిలి మాత్రమే కరెక్ట్ అని ప్రతి ఒక్కరూ అంటారనీ నమ్మబలుకుతున్నారు. ఏతావాతా...షామిలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూలై 3 వరకూ ఆగక తప్పదు. అదే రోజు 'ఓయ్' విడుదలవుతోంది. అన్నట్టు...ఈ చిత్రం కోసం షామిలి 20 లక్షల పారితోషికం అందుకుందట.
Be first to comment on this News / Article!
|