27న 'రూ.999 మాత్రమే'
సంపూర్ణ అక్షరాస్యత పేరుతో అందర్నీ చదువుకోవాలని ప్రోత్సహించే ప్రభుత్వం నలుగురు యువకులకు ఏమీ చేయలోకపోతుంది. ఆ కుర్రాళ్ల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే ఇతివృత్తంలో 'రూ.999 మాత్రమే' చిత్రం రూపొందింది. కౌటిల్య, ప్రభాకర్, మధు, అనిల్, ప్రవీణ్ బాబు, క్రిష ప్రధాన పాత్రధారులు. నెవర్ 9 క్రియేటర్స్ పతాకంపై పర్స మహేందర్ దర్శకత్వంలో గోవింద్ నవీన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి సారథ్యంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైద్రాబాద్ లో మంగళవారంనాడు ఆ వివరాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
పరిరక్షణ సమితి కార్యదర్శి నట్టికుమార్ మాట్లాడుతూ, విడుదలకు పదిరోజుల ముందే ఈ చిత్రం పబ్లిసిటీని విడుదల చేశామనీ, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్మాతలను ఆదుకునే ధ్యేయంతో సమితిని స్థాపించి తమ సారథ్యంలో 'రూ.999 మాత్రమే' చిత్రాన్ని విడుదల చేస్తున్నామనీ చెప్పారు. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తారతమ్యం లేకుండా నిర్మాతలకు అండగా నిలబడటమే సమతి ధ్యేయమని సమితి సభ్యుడు దశరథ తెలిపారు. చిత్ర నిర్మాత గోవింద్ నవీన్ మాట్లాడుతూ, కథే హీరోగా సస్పెన్స్ ప్రదానంగా రూపొందించిన ఈ చిత్రం తప్పనిసరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఇందులో ఓ ప్రముఖ హీరో కీలక పాత్రను పోషించారనీ, ఆ హీరో ఎవరనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందేననీ దర్శకుడు మహేందర్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, జయప్రకాష్ రెడ్డి, శివకృష్ణ, నర్సింగ్ యాదవ్, చిత్రం శ్రీను, హేమ, జయలలిత తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|