వర్మ 'అడవి' వాయిదా
హారర్ సినిమాలు తీయడమంటే రామ్ గోపాల్ వర్మకు బోలెడంత ఇష్టం. తన సినిమాలతో ప్రేక్షకులను భయభ్రాంతులను చేయబోతున్నాననీ, ఒంటరిగా సినిమా చూడగలిగితే క్యాష్ ప్రైజ్ లు ఇస్తాననీ చెప్పుకోవడం ఆయనకు రివాజు. అయితే ఈ తరహా చిత్రాలు చాలా బాక్సాఫీస్ సక్సెస్ కు నోచుకోకపోయినా వర్మ మాత్రం మళ్లీ మళ్లీ తన ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. అందులో భాగంగానే ఆయన నితిన్, ప్రియాంక కొఠారి జంటగా 'అడవి' అనే జంగిల్ అడ్వంచర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హిందీలో 'అజ్ఞాత్' గా ఈ చిత్రం విడుదలవుతుంది. తెలుగు హీరో నితిన్ కు ఇది తొలి హిందీ చిత్రం కావడం విశేషం. శ్రీలంక అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని యూటీవీ మోషన్ పిక్చర్స్ నిర్మించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం జూలై 24న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, తాజా సమాచారం ప్రకారం విడుదల తేదీ ఆగస్టు 7కు వాయిదా పడింది.
బాలీవుడ్ లో నిర్మాతలకూ, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకూ పెర్సంటేజ్ షేర్ విషయంలో తలెత్తిన వివాదంలో గత నాలుగు నెలలుగా కొత్త రిలీజ్ లు ఆగిపోయాయి. ఈ ప్రతిష్ఠంభనకు ఈమధ్యనే తెరపడింది. దీంతో వరుస కొత్త రిలీజ్ లు థియేటర్లను ముంచెత్తనున్నాయి. 'లవ్ ఆజ్ కల్', 'లక్' వంటి పలు చిత్రాలు క్యూలో ఉండటంతో వర్మ తన 'అజ్ఞాత్'ను ఆగస్టుకు వాయిదా వేశారు. మొత్తానికి అందర్నీ భయపెట్టాలనుకునే వర్మ బయపడినట్టున్నారు...
Be first to comment on this News / Article!
|