పరుచూరి 'జంక్షన్' 26న
పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్రనాథ్ కథానాయకుడిగా అనిల్ దర్శకత్వంలో లియో ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై బి.రామకృష్ణ నిర్మించిన చిత్రం 'జంక్షన్'. ఈనెల 26న ఈ చిత్రం విడుదలవుతోంది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో బుధవారంనాడు ఆ విశేషాలను పరుచూరి సోదరులు, రవీంద్రనాథ్ తెలియజేశారు.
తొలుత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోల చిత్రాలకు తాము రచన చేశామనీ, మరెందరినో ప్రోత్సహించామనీ చెప్పారు. తన కుమారుడు రవీంద్రనాథ్ ఈ చిత్రం హీరోగా పరిచయమవుతున్నాడని తెలిపారు. ఈ సినిమా చూసి రవీంద్రబాబు బాగా నటించాడని దాసరి, సురేష్ బాబు అభినందించారనీ, ప్రేక్షకులు కూడా తన కుమారుని ఆదరించాల్సిందిగా కోరుతున్నాననీ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, టి.కృష్ణ తరహా చిత్రాలకు రవీంద్రబాబు బాగా సరిపోతాడని భావించి అలాంటి కథనే ఈ సినిమా కోసం ఎంచుకున్నామని చెప్పారు. రవీంద్రబాబు సహజనటుడనీ, దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారనీ పేర్కొన్నారు. జంక్షన్ లో బతుకుతున్న ఓ యువకుడు అక్కడ ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడనేది ఇందులో చూపించినట్టు పేర్కొన్నారు. సీరియస్ సబ్జెక్ట్ అయినా చక్కటి కమెడియన్స్ తో మంచి ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుందన్నారు. హీరోగా తనకిది తొలి చిత్రమే అయినా తనకు మంచి సంతృప్తి కలిగించిందనీ, సీనియర్ నటులు తననెంతో ఎంకరేజ్ చేశారనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మయూరి, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, రవివర్మ, సుబ్బరాయశర్మ, వైభవ్, చంద్ర, గోవింద్, మధుశ్రీ, సరిత తదితరులు నటించారు. ప్రతాప్ కుమార్ సినిమాటోగ్రఫీ, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|